Begin typing your search above and press return to search.

సీమాంధ్రుల గోడుకు కదిలిపోయిన టీ లాయర్

By:  Tupaki Desk   |   15 Dec 2015 4:30 AM GMT


స్పందించే మనసు ఉండాలే కానీ.. ప్రాంతీయ భావన అన్నది చాలా చిన్న అంశమన్న విషయాన్ని చేతల్లో చూపించి ఆదర్శంగా నిలిచారు తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాది ఒకరు. ఏపీ తాత్కలిక రాజధాని బెజవాడలో వెలుగులోకి వచ్చిన కామా (కాల్ మనీ) వ్యవహారం.. బాధితుల ఆవేదన.. వారు పడుతున్న కష్టాలను విన్న తెలంగాణ న్యాయవాది అరుణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు.

తాజాగా ‘‘కామ’’ వ్యవహారం తెరపైకి రావటం.. బాధితుల గోడు వింటుంటే వారి వేదన హృదయ విదారకంగా ఉండటంతో పలువురు కదిలిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ న్యాయవాది అరుణ్ కుమార్ స్పందించారు. బెజవాడలో జరుగుతున్న కామ దందాపై తాజాగా ఆయన మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఈ అంశంపై వారం రోజుల్లో నివేదిక అందిందాలని.. ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించి బాధితులకు అండగా నిలవాలంటూ కోర్టు ఏపీ సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రా ప్రాంతానికి సంబంధించిన అంశాల్లో తెలంగాణ లాయర్ సాయం చేయటంపై కాస్తంత విస్మయానికి గురి చేసిన పరిస్థితి. దీనిపై వివరణ ఇచ్చిన అరుణ్ కుమార్.. న్యాయం విషయంలో ప్రాంతాలు.. రాష్ట్రాల మధ్య విబేధాలు లేవని చాటేందుకే తానీ ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించారు. అయితే.. హైదరాబాద్ హైకోర్టులో ఆంధ్రా ప్రాంతానికి చెందిన లాయర్లు బోలెడంత మంది ఉంటే.. కనీసం వారెవరికీ పట్టకపోవటం గమనార్హం. సామాజిక బాధ్యతతో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక న్యాయవాది స్పందించిన తీరు చూస్తే.. విడిపోయి కలిసి ఉండటమనే మాటకు నిజమైన అర్థంగా ఈ ఉదంతం కనిపించక మానదు. హేట్సాఫ్ అరుణ్ కుమార్.