Begin typing your search above and press return to search.

లాయ‌ర్ జోస్యం:2జీ లాగే నీర‌వ్ కేసు వీగిపోతుంది

By:  Tupaki Desk   |   21 Feb 2018 6:42 AM GMT
లాయ‌ర్ జోస్యం:2జీ లాగే నీర‌వ్ కేసు వీగిపోతుంది
X

రూ.11,400 కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ వ్యవహారంపై సంచ‌ల‌న కామెంట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆయన లాయర్ విజయ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోడీపై నమోదైన కేసు కూడా బోఫోర్స్ - 2జీ కేసుల మాదిరిగానే కోర్టు ముందు కుప్పకూలక తప్పదన్నారు. ఇప్పటికే టెలికం కుంభకోణం సహా పలు హై-ప్రొఫైల్ నిందితుల తరపున వాదించి నెగ్గిన అగర్వాల్..పీఎన్‌ బీ స్కాం కేసులో నీరవ్ మోదీ తరపున వాదించనున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పీఎన్‌ బీ కేసులో తెలిపినట్టు తన క్లయింట్ ఎలాంటి నేరానికి పాల్పడలేదన్నారు. నీరవ్ మోడీపై వస్తున్న ఆరోపణలన్నీ తప్పుడవే అన్నారు. ఒకవేళ మోడీ మోసానికి పాల్పడితే.. రూ.5వేల 600 కోట్ల విలువైన ఆస్తులను ఎందుకు వదిలేస్తారని ప్రశ్నించారు. వాటిని ఇప్పటికే ఈడీ స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మోసం చేసి పారిపోవాలని నీరవ్ మోడీ భావిస్తే.. విజయ్ మాల్యాలాగే అన్నీ పట్టుకుని వెళ్లిపోయేవారన్నారు. రూ.5,600 కోట్ల విలువైన వజ్రాలు - నగలు దేశంలోనే ఎందుకు వదిలి వెళ్లినట్టు.. అని అగర్వాల్ ప్రశ్నించారు. నీరవ్‌పై దాఖలు చేసిన FIR.. చిత్తుకాగితంతో సమానమంటూ తీసిపారేశారు. తన క్లయింట్‌ పై వచ్చిన ఆరోపణలన్నీ విచారణ సందర్భంగా కొట్టుకుపోతాయన్నారు మోడీ లాయర్ విజయ్ అగర్వాల్ దీమా వ్యక్తం చేశారు. గతంలో టెలీకం కుంభకోణాన్ని వాదించి గెలిచింది విజయ్‌ అగర్వాలే అవడంతో ఆయన చేసిన కామెంట్స్‌కు ప్రాధాన్యత చేకూరింది.