Begin typing your search above and press return to search.

అప్పటి గాంధార రాజ్యం.. మళ్లీ తాలిబన్ల వశం!

By:  Tupaki Desk   |   16 Aug 2021 1:30 PM GMT
అప్పటి గాంధార రాజ్యం.. మళ్లీ తాలిబన్ల వశం!
X
ఆధునిక యుగంలో.. అందునా డిజిటల్ ప్రపంచంలో తుపాకుల రాజ్యం.. ఆటవిక న్యాయాన్ని అమలు చేసే బండ మనుషులు పాలకులుగా మారితే ఉండే కష్టం అంతా ఇంతా కాదు. ఎప్పుడు ఎవరేం చేస్తారో అర్థంకాని పరిస్థితి ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో నెలకొంది. అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి.. ఆ దేశాన్ని తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్న తాలిబన్లు ఇక ఆ దేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేయనున్నారు. అఫ్గాన్ గురించి తెలిసిన ప్రతిసారీ అయ్యో అనుకోకుండా ఉండలేం. ఎలాంటి దేశం ఎలా అయిందన్న వేదన కలుగకుండా ఉండదు.

నాగరికత అన్నమాట ప్రపంచానికి సరిగా పరిచయం లేని వేల ఏళ్ల కిందటే ఆఫ్గాన్ రాజ్యంలో వెల్లువిరిసిన నాగరికతను చూసిన చాలామంది దేవతలకు నెలవుగా అభివర్ణించేవారు. సువాసనల భూమిగా కొలిచే సుభిక్ష సామ్రాజ్యం ఆధునిక యుగంలో మాత్రం అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారిపోయింది. మహాభారత యుద్ధం నాటికి మహా సామ్రాజ్యంగా నిలిచిన గాంధార భూమి తన గుర్తింపును.. గొప్పతనాన్ని అంతకంతకూ కోల్పోయేలా చేసుకుంది. రుగ్వేద కాలంలోనే ఈ ప్రాంతానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్ని ఇన్ని కావు.

అఫ్గాన్ అన్న మాట 'అశ్వకన్'.. 'అస్సాకన్' పేరు నుంచి పుట్టింది. ఈ ప్రాంత నైసర్గిక స్వరూపం రీత్యా చూస్తే.. ఇక్కడ ఎక్కువగా గుర్రాలపై సంచారం చేసేవారు. అశ్వికుల తెగలు నివసించే ప్రాంతం కావటంతో దీన్ని అఫ్గానిస్తాన్ గా పిలవటం మొదలైంది. ఇక్కడి వారందరిని అఫ్గాన్లుగా చెప్పుకున్నప్పటికి.. పష్తో భాష మాట్లాడే వారిని మాత్రమే అసలుసిసలు అఫ్గానులుగా చెప్పాలి.

క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో ఈ ప్రాంతం వారిని 'అవగాన' అని భారతీయ జ్యోతిశ్శాస్త్రవేత్త వరాహమిహిరుడు పేర్కొన్నారుఈ ప్రాంతంలో మానవ నివాసం ప్రాచీన శిలా యుగం నాటి నుంచి ఉంది. సింధు నాగరికత ఈ ప్రాంతంలో ప్రబలిందనటానికి షోర్తుగై ప్రాంతంలో తవ్వకాలు నిదర్శనంగా నిలుస్తాయి. గాంధార రాజ్యం పతనమయ్యాక జొరాష్ట్రియన్ మతం ఇక్కడ ప్రబలింది. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని ఆరియానా అని పిలిచేవారు.

తర్వాతి కాలంలో మౌర్యులు.. కుషాణులు.. మంగోలులు.. అరబ్బులు.. బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని పాలించారు. అరబ్బుల దండయాత్రల అనంతరం ఇక్కడ ఇతర మతాలు దాదాపు క్షీణించి.. ముస్లింల ప్రాబల్యం బాగా పెరిగింది. ఆధునిక యుగంలో 1747లో అహ్మద్ షా దురానీ తొలిసారి కాందహార్ రాజధానిగా అఫ్గాన్ సామ్రాజ్యాన్ని ఏర్పర్చారు. 1776లో రాజధాని కాబూల్ కు మారింది. తొలి ఆంగ్లో అఫ్గాన్ యుద్ధం తర్వాత ఈ ప్రాంతం కొంతకాలం బ్రిటీష్ పాలనలో ఉంది. 1919లో దేశానికి పూర్తి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అఫ్గానిస్తాన్‌ అనే పదాన్ని ప్రామాణికం చేసి 1923లో రచించిన రాజ్యాంగంలో పొందుపర్చారు. చాలాకాలం అమానుల్లాఖాన్ తదితరుల నేతృత్వంలో రాజరికం నడిచింది.

1973లో జహీర్ షా పై జరిగిన తిరుగుబాటు అనంతరం రిపబ్లిక్ గా మారింది. 1978 తిరుగుబాటు తర్వాత సోషలిస్టు రాజ్యంగా రూపాంతం చెందింది. కానీ.. తిరుగుబాట్లు అధికం కావటంతో రష్యాతో ముజాహిద్దీన్ల యుద్ధంతో అస్థిరత నెలకొంది. 1994లో ఆవిర్భవించిన తాలిబన్లు 1996 నాటికి అఫ్గానిస్తాన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. 2001లో అమెరికా దాడులు జరిపి.. వారిని ఊచకోత కోసింది. అనంతరం అమెరికా అండతో పౌర ప్రభుత్వం ఏర్పాటైంది.

రెండు దశాబ్దాలు అమెరికా.. మిత్రదేశాల రక్షణలో అఫ్గాన్ లో ప్రజాస్వామ్యం ఇప్పుడిప్పుడే మొదలవుతున్న వేళలో 2004లో జరిగిన ఎన్నికల్లో హమీద్ కర్జాయ్ దేశాధ్యక్షుడయ్యాడు. 2014లో అష్రాఫ్ ఘనీ అధ్యక్షుడిగా ఎంపికై ఆదివారం వరకు (ఆగస్టు 15) పాలించారు. ఇరవై ఏళ్ల నుంచి అఫ్గాన్ లో ఉన్న అమెరికా సేనలు.. బైడెన్ అధ్యక్షుడయ్యాక అఫ్గాన్ నుంచి తమ సేనల ఉపసంహకరణను ముమ్మరం చేశారు.

అమెరికా సేనలు ముఖం తిప్పగానే.. తాలిబన్లు తలెగరేశారు. గతంలో మాదిరి దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని అక్రమించుకుంటూ వస్తున్న వారు.. ఆదివారం మధ్యాహ్నానానికి రాజధాని కాబూల్ ను హస్తగతం చేసుకున్నారు. ప్రస్తుతం మత ఛాందస మూకల చేతికి చిక్కిన నాటి దేవతల భూమి ఇప్పటి పరిస్థితి చూస్తే.. దేవుడు శాపం పెట్టాడా? అన్న భావన కలుగక మానదు. అగ్రరాజ్యాలు ఆడుకోవటానికి నెలవుగా.. ఉగ్రమూకలు తమ శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించుకోవటానికి ప్రయోగశాలగా మారిన అఫ్గానిస్తాన్ రానున్న రోజుల్లో ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుందా? అన్నదే ప్రజాస్వామ్యవాదుల ఆందోళన. ఏదీ ఉత్తినే జరగదంటారు. అఫ్గానిస్తాన్ లో చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఈ కోవలోకే వస్తాయా? అన్నది అసలు ప్రశ్న. దీనికి కాలమే సరైన సమాధానం చెప్పగలదు.