Begin typing your search above and press return to search.

పారిపోయానే కానీ డబ్బులతో కాదు.. బూట్లు కూడా వేసుకోలేదు

By:  Tupaki Desk   |   19 Aug 2021 4:50 AM GMT
పారిపోయానే కానీ డబ్బులతో కాదు.. బూట్లు కూడా వేసుకోలేదు
X
తాలిబన్లు కాబూల్ ను చుట్టుముట్టిన వేళ.. అఫ్గాన్ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పత్తా లేకుండా పోవటం తెలిసిందే. తాను దేశాన్ని విడిచి వెళ్లటానికి కొన్నిగంటల ముందు దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. తాలిబన్లను ఎదుర్కొంటామని చెప్పారు. అందుకు భిన్నంగా పత్తాలేకుండా పారిపోయారు. ఆయన ఏ దేశానికి వెళ్లిన విషయం కూడా బయటకు రాలేదు. అదే సమయంలో ఆయన సంచులకొద్దీ డబ్బులతో పారిపోయినట్లుగా వార్తలు రావటం సంచలనంగా మారింది.

ఐదు కార్ల నిండా డబ్బుతో పాటు.. ఆయన ప్రయాణిస్తున్న విమానం మొత్తాన్ని నోట్ల కట్టలతో కుక్కేశారని.. మరింత డబ్బును విమానంలో పెట్టే స్థలం లేక విడిచిపెట్టి వెళ్లినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన తనతో తీసుకెళ్లిన సొత్తు దగ్గర దగ్గర 169మిలియన్ డాలర్లుగా ఉంటాయన్న లెక్క కూడా బయటకు వచ్చింది. ఆయన దొంగలించిన సొత్తు అంటూ బయటకు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. తాజాగా అష్రఫ్ అలీ స్పష్టం చేశారు.

తనపై పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు సంప్రదాయ దుస్తులు.. ఒక చొక్కా.. చెప్పులతోనే తాను దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు చెప్పారు. ‘‘కనీసం షూ కూడా వేసుకోలేదు. డబ్బు కట్టలతో వెళ్లినట్లు వచ్చిన ఆరోపణలు నిరాదారం. నేను డబ్బుతో పారిపోయాననేది అబద్ధం. కావాలంటే యూఏీ కస్టమ్స్ అధికారులతో ధ్రువీకరించుకోవచ్చు. దేశంలో రక్తపాతాన్ని నివారించటానికి ఉన్న ఏకైక మార్గంగానే కాబూల్ నుంచి పారిపోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. తాను యూఏఈలో ఉన్న విషయాన్ని ఆయన వెల్లడించారు.

తాను నాలుగు కార్లు.. హెలికాఫ్టర్ నిండా డబ్బులతో పారిపోయినట్లు చెబుతున్న సమాచారంలో నిజం లేదని.. తాను డబ్బు సంచులతో పారిపోయినట్లుగా ఆరోపించిన రష్యా రాయబారి చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. దేశాధినేతగా తనకున్న ప్రాణహాని నేపథ్యంలోనే తానుపారిపోయానని చెప్పారు. త్వరలోనే తాను దేశానికి తిరిగి వస్తానని పేర్కొన్నారు.