Begin typing your search above and press return to search.

తాలిబన్ల చేతిలోకి అప్ఘనిస్తాన్

By:  Tupaki Desk   |   15 Aug 2021 2:30 PM GMT
తాలిబన్ల చేతిలోకి అప్ఘనిస్తాన్
X
అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను కూడా తాలిబన్ ఉగ్రమూకలు ఆక్రమించడంతో ఇక మొత్తం అప్ఘనిస్తాన్ దేశం వారి వశమైంది. అప్ఘనిస్తాన్ లోని ప్రజా ప్రభుత్వం అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ లొంగిపోయారు. తాలిబన్లకు పాలన అప్పగించారు. ఊహించని దానికంటే వేగంగానే కాబుల్ ను స్వాధీనం చేసుకొని తాలిబన్లు తమ జెండాను ఎగురవేశారు.

దేశ రాజధాని కాబూల్ నగరం నలువైపుల నుంచి తాలిబన్లు నగరంలోకి ప్రవేశించి దాడి చేశారు. దీంతో అప్ఘానిస్తాన్ ప్రభుత్వం లొంగిపోయింది. తాలిబన్లు కాబూల్ పై ఎలాంటి దాడి చేయలేదని.. అధికార మార్పిడి శాంతియుతంగా జరిగిందని అప్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ప్రస్తుతం అప్ఘానిస్తాన్ అధ్యక్షుడి భవనం వైపు తాలిబన్లు దూసుకెళుతున్నారు. మరికాసేపట్లో అధికార మార్పునకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అప్ఘనిస్తాన్ లోని 34 రాష్ట్ర రాజధానుల్లో ఇప్పటికే 29 నగరాలను తాలిబన్లు ఆక్రమించుకున్నారు.ఇవాళ కాబూల్ తోపాటు మిగిలిన నగరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్ల అరాచకాలతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చాలా మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోతున్నారు. ఇల్లు, ఆస్తులను వదిలేసుకొని పిల్లాపాపలతో పక్క దేశాలకు శరణార్థులుగా తరలివెళుతున్నారు.

రాజధానిలోకి తాలిబన్లు ప్రవేశించడంతో కాబూల్ లోని బ్యాంకుల్లో తాము దాచుకున్న నగదు తీసుకెళ్లడానికి ప్రజలు క్యూ కట్టారు. ఇప్పటికే ఏటీఎంలు పనిచేయడం లేదు. తాలిబన్ల ఎంట్రీతో కాబూల్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు.

తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అప్ఘానిస్తాన్ తో సరిహద్దును పాకిస్తాన్ పూర్తిగా మూసివేసింది. భారత్ కు అనుకూలంగా ఉండే అప్ఘానిస్తాన్ శరణార్థులకు వీసాలకు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.

అప్ఘానిస్తాన్ లో అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత అక్కడ తాలిబన్ల అరాచకాలకు అడ్డే లేకుండాపోయింది.తాజాగా తమ దౌత్య కార్యాలయ సిబ్బందిని అమెరికా ప్రభుత్వం హెలిక్యాప్టర్ల ద్వారా తరలిస్తోంది.