Begin typing your search above and press return to search.

భారత్ - పాక్ లకు అఫ్రిది సలహా ఇది!

By:  Tupaki Desk   |   30 Sept 2016 5:54 PM IST
భారత్ - పాక్ లకు అఫ్రిది సలహా ఇది!
X
ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తరువాత - ఇటు భారత్ అటు పాకిస్థాన్‌ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాలు సరిహద్దుల వద్ద సైన్యాన్ని మోహరిస్తున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో క్షణక్షణం ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయనే చెప్పాలి!! ఇప్పటికే భారత సరిహద్దుల్లో 10 కిలోమీటర్ల మేర సుమారు వెయ్యి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సమయంలో ఏ క్షణమైనా యుద్దం మొదలవ్వొచ్చనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది స్పందించాడు.

క్రికెట్ నుంచి దాదాపు రిటైర్ అయి - సామాజికసేవ చేస్తున్న బూం బూం ఆఫ్రిది.. ఇండియా - పాక్ ల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలపై ట్విట్టర్ లో స్పందించాడు. "చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉండగా యుద్ధంలాంటి తీవ్ర నిర్ణయాలు ఎందుకు? పైగా పాకిస్థాన్ శాంతికాముక దేశం. భారత్ తో పాటు అందరితోనూ పాకిస్థాన్ సుహ్రుద్భావ సంబంధాలను కోరుకుంటోంది. యుద్ధమే వస్తే గనుక ఇరు పక్షాలు తీవ్రంగా నష్టపోతాయి. అందుకే 'శయ్ నొ 2 వర్" అని అఫ్రిదీ పేర్కొన్నాడు.

అయితే... ఇప్పటివరకూ భారత్ పై ఉగ్రదాడులు ఎన్నో జరిగాయి, ఈ విషయంలో ప్రతిసారీ పాక్ దే ఆ పని అని భారత్ చాలా సార్లు చెప్పింది. ఆ సమయంలో ఉగ్రవాదుల చర్యను ఖండిస్తున్నామని కానీ, ఏ దేశమైనా సరే ఉగ్రవాదులను ప్రోత్సహించడం, సంరక్షించడం చేయకపోవడం మంచిదని కానీ... కనీసం ఇలాంటి రెగ్యులర్ స్టేట్ మెంట్స్ కూడా ఇవ్వని అఫ్రీది తాజాగా "పాకిస్థాన్ శాంతికాముక దేశం" అని, ఇండియా - పాకిస్థాన్ లు కూర్చుని మాట్లాడుకోవాలని (ఉచిత) సలహాలు చెప్పడం గమనార్హం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/