Begin typing your search above and press return to search.

ఢిల్లీ యువతి దారుణ హత్య.. నిందితుడు బెయిల్‌ తిరస్కరించింది అందుకేనా!

By:  Tupaki Desk   |   22 Dec 2022 7:31 AM GMT
ఢిల్లీ యువతి దారుణ హత్య.. నిందితుడు బెయిల్‌ తిరస్కరించింది అందుకేనా!
X
ఢిల్లీలో తనతో సహజీవనం చేస్తున్న కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ ని 35 ముక్కలుగా నరికి చంపిన కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అతడు తన బెయిల్‌ పిటిషన్‌ ను ఉపసంహరించుకున్నాడు. సమాచార లోపం కారణంగానే తాను ఆ పిటిషన్‌ ను దరఖాస్తు చేసినట్లు ఆఫ్తాబ్‌ కోర్టుకు వివరించాడు. దీంతో అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆ పిటిషన్‌ ను కొట్టివేసింది.

ఈ కేసులో బెయిల్‌ కోరుతూ ఆఫ్తాబ్‌ తరఫున న్యాయవాది డిసెంబరు 15న కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అది బెయిల్‌ పిటిషన్‌ అని తనకు తెలియదని అఫ్తాబ్‌ చెప్పాడు. పొరపాటుగా దాఖలైందని ఆ తర్వాత నిందితుడు కోర్టు దృష్టికి తెచ్చాడు. దీనిపై ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. సమాచారలోపంతో పొరపాటున బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేసినట్టు అఫ్తాబ్‌ న్యాయవాది న్యాయమూర్తికి వివరించారు. ఈ దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిందితుడు అఫ్తాబ్‌ నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి బృందాకుమారి ప్రకటించారు.

కాగా నిందితుడు అఫ్తాబ్‌ పిటిషన్‌ ను వెనక్కి తీసుకోకముందు పోలీసులు సైతం అతడికి బెయిల్‌ ఇవ్వవద్దని విన్నవించారు. ఇది అత్యంత తీవ్రమైన నేరమని కోర్టు దృష్టికి తెచ్చారు. శ్రద్ధా వాకర్‌ హత్య సమాజంలో తీవ్ర అలజడి రేపిందన్నారు. అందువల్ల అప్తాబ్‌ కు బెయిల్‌ మంజూరు చేయొద్దని న్యాయస్థానానికి విన్నవించారు.

కాగా నిందితుడు అప్తాబ్‌ తనకు బెయిల్‌ వద్దని కోరడం వెనుక కారణాలున్నాయని అంటున్నారు. అతడు బెయిల్‌ తో స్వేచ్ఛగా బయట తిరిగితే ఎవరో ఒకరు అతడిని కొట్టి చంపే ప్రమాదం ఉందని అప్తాబ్‌ భావిస్తున్నట్టు సమాచారం.

ఇటీవల ఆఫ్తాబ్‌ను పాలిగ్రాఫ్‌ పరీక్షల నిమిత్తం జైలు నుంచి బయటకు తీసుకురాగా.. పోలీసు వాహనంపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. అతడిని తమకు అప్పగించాలని నినాదాలు సైతం చేశారు. గతంలో నిర్భయను గ్యాంగ్‌ రేప్‌ చేసిన కేసులో నిందితుడి ఒకడిని తీహార్‌ జైలులో తోటి ఖైదీలే కొట్టి చంపారు.

ఈ నేపథ్యంలో అఫ్తాబ్‌ బయటకు వస్తే మళ్లీ అతడిపై దాడి జరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. కోర్టులో కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే అతడిని హాజరుపరుస్తున్నారు. ప్రస్తుతం అతడు తీహార్‌ జైలులో ఉన్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.