Begin typing your search above and press return to search.

214 ఏళ్ళ తరువాత జగన్ చేసిన పెద్ద పని...?

By:  Tupaki Desk   |   4 April 2022 9:35 AM GMT
214 ఏళ్ళ తరువాత జగన్ చేసిన పెద్ద పని...?
X
ఏదైనా ఒక సంస్కరణ అయినా కొత్త మార్పు అయినా చేపట్టాలీ అంటే అనుకున్నంత ఈజీ అయితే కాదు, దానికి చాలా వ్యయ ప్రయాసలు పడాలి. గట్టి సంకల్పం ఉండాలి. ఒక విధంగా మొండితనంగా ఉండాలి. ఇలా అన్నీ కలసివస్తేనే అది సాకారం అయ్యేది. ఇపుడు ఏపీలో కొత్త జిల్లాల వెనక కూడా చాలా పట్టుదల ఉంది. నిజానికి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఇది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. అలా కనుక చూస్తే దీనికి తొలిగా పెట్టుకున్న ముహూర్తం 2020 జనవరి 26. అంటే ఆనాటి రిపబ్లిక్ డే వేడుకల మధ్యన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నది టార్గెట్.

దానికి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. అది కసరత్తు అంతా చేసింది. అయితే మొదట అనుకున్న టైంకి అది పూర్తి కాకపోవడంతో అదే ఏడాది ఉగాది అని అనుకున్నారు. కానీ అది వీలుపడలేదు. కరోనా వైరస్ మహమ్మారి వచ్చి మొత్తానికి అడ్డం కొట్టేసింది. ఆ తరువాత నీలం సాహ్ని పదవీ విరమణ చేశారు.

ఆ కసర‌త్తు దాని తాలూకా నివేదికలు అన్నీ వేరొకరు బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్లారు. 2021 ఉగాది లోగా కొత్త జిల్లాలు అనుకుంటే జనాభా గణన పేరిట మరో అడ్డంకి వచ్చిపడింది. ఇలా రెండేళ్ల పాటు ఇబ్బందులు వచ్చాయి. ఇక 2022 ఉగాదికి కొత్త జిల్లాలు ఖాయమని అనుకున్నా చివరి నిముషం వరకూ అది అవుతుందా అన్నది మాత్రం డౌట్ గానే ఉంది. మొత్తానికి ఉగాది వెళ్లిన రెండు రోజుల తరువాత ఏప్రిల్ 4న అపాయింటెడ్ డే గా కొత్త జిల్లాలను ప్రకటించారు.

ఇది ఏపీ చరిత్రలో గుర్తుండిపోయే దినంగా చూడాలి. ఇదంతా ఎందుకంటే ఏపీ చరిత్ర చూస్తే ఇంత పెద్ద ఎత్తున జిల్లాలు ఏర్పాటు ఇంతకు ముందు జరిగింది లేదు. ఉమ్మడి మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినపుడు ఉన్నవి 11 జిల్లాలు మాత్రమే. ఇక 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పాటు అయితే 1979 జూన్ లో విజయనగరం జిల్లా ఏర్పడింది. అలా పదమూడు జిల్లాలతో గత 43 ఏళ్ళుగా ఏపీ కొనసాగింది.

ఇక ఏపీలో మొదటి జిల్లా ఆవిర్భావం ఎపుడు అంటే అది కూడా ఆసక్తికరమే. 1808లో అప్పటి పాలకులు ఆంధ్రాలో తొలి జిల్లాగా కడపను ఏర్పాటు చేశారు. ఆ తరువాత మెల్లగా మిగిలిన జిల్లాలు వచ్చాయి. అన్నీ కలసి 1953 నాటికి 11 జిల్లాలుగా మారాయి.

ఇక ఇపుడు విశేషం ఏంటి అంటే ఏపీకి తొలి జిల్లాగా కడప ఉంటే అదే కడప నుంచి వచ్చి నవ్యాంధ్రకు రెండవ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ ఏకంగా పదమూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం. అంటే ఏపీ దశ, దిశను 214 ఏళ్ల తరువాత మరోమారు కడప మార్చింది అనుకోవాలి. దీని మీద ప్రణాళిక సంఘం అధికారులు మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఒక సంస్కరణగా అభివర్ణించారు. నాటి రాజుల నుంచి నేటి సీఎం ల వరకూ ఇలా మార్పునకు నాంది పలికిన ప్రతీ ఒక్కరినీ చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు.

ఏపీకి తొలి జిల్లా అయిన కడప నుంచి వచ్చిన జగన్ ఏపీ స్వరూప స్వభాభాలను మార్చి చరిత్రలో స్థానం సంపాదించుకున్నారని వారు ప్రశంసించారు. మొత్తానికి రెండు శతాబ్దాల తరువాత ఏపీ మరింతగా సరికొత్త రూపును సంతరించుకుందని చెప్పాలి.