Begin typing your search above and press return to search.

అల్లా త‌ర్వాత సుష్మానే అంటున్న పాక్ జాతీయుడు

By:  Tupaki Desk   |   26 Nov 2017 11:53 AM GMT
అల్లా త‌ర్వాత సుష్మానే అంటున్న పాక్ జాతీయుడు
X
బీజేపీ సిద్ధాంతాల‌ను బ‌లంగా న‌మ్మి పాటించ‌డ‌మే కాకుండా... సేవాగుణం ఉట్టిప‌డ్డ నాయ‌కుల్లో ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి సుష్మాస్వ‌రాజ్ ప్ర‌ముఖ‌మైన వ్య‌క్తి. సీనియ‌ర్ నాయ‌కురాలు అయిన‌ప్ప‌టికీ మారుతున్న కాలానికి త‌గిన‌ట్లు ఆమె సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకున్నారు. సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉండ‌ట‌మే కాదు స‌మ‌స్య‌ల ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించే విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తాజాగా మరో రికార్డు సృష్టించారు. దాయాది దేశమైన పాకిస్తానీకి తిరిగి ప్రాణం పోసే నిర్ణయం తీసుకున్నారు.

సాహజైబ్‌ ఇక్బాల్‌ అనే లాహోర్‌కు చెందిన వ్యక్తి కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌కు మెడికల్‌ వీసా కోసం ట్విటర్‌లో విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. ``ఆఫ్టర్‌ అల్లా యూ ఆర్‌ అవర్‌ లాస్ట్‌ హోప్‌ (అల్లా తరువాత మీరే మాకు తుది ఆశ) అంటూ సదరు పాకిస్తానీ జాతీయుడు సుష్మా స్వరాజ్‌కు ట్వీట్‌ చేశారు. లివర్‌ కేన్సర్‌తో బాధపడుతున్న తన కజిన్‌కు లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స చేయించాల్సి ఉందని ఇస్లామాబాద్‌లోని ఎంబసీ ద్వారా తమకు మెడికల్‌ వీసా ఇప్పించాలని ఇక్బాల్‌ కోరాడు. అల్లా తరువాత మీరే మాకు తుది ఆశ అంటూ పేర్కొన్నాడు.దీనికి స్పందించిన సుష్మా స్వరాజ్‌ మీ ఆశలను భారతదేశం ఎన్నడూ వమ్ము చేయదని భరోసా ఇచ్చారు. తక్షణమే మెడికల్‌ వీసా ఇప్పిస్తామని ఆమె ట్విటర్‌ ద్వారా సమాధానం ఇచ్చారు.

కాగా, గ‌తంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై ఓ పాకిస్తానీ మహిళ ప్రశంసల వర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఆమె మా ప్రధాని అయిఉంటే తమ దేశం ఎప్పుడో బాగుపడి ఉండేదంటూ కొనియాడింది. పాకిస్తాన్ కు చెందిన హిజాబ్‌ అసీఫ్‌ అనే మహిళ కాలేయ సమస్యతో బాధపడుతోంది. వెంటనే ఆమె భారత్‌లో చికిత్స చేయించుకోవాల్సి ఉంది. ఇందుకోసం హిజాబ్‌ మెడికల్‌ వీసా కోసం ఇస్లామాబాద్‌లోని డిప్యూటీ హైకమిషనర్‌ను ఆశ్రయించింది. కానీ ఇందుకు కమిషనర్‌ ఒప్పుకోలేదు. ఈ విష‌యంలో హిజాబ్‌ సుష్మా స్వరాజ్‌ను ఆశ్రయించింది. ‘మేడమ్‌.. నాకు కాలేయ సమస్య ఉంది. భారత్‌లో చికిత్స చేయించుకోవాలి. మెడికల్‌ వీసా కావాలని అడిగితే అది మీరే చూసుకోవాలని అంటున్నారు. నాకు సాయం చేయండి’ అని ట్వీట్‌చేసింది. ఎప్పటిలాగే వెంటనే స్పందించిన సుష్మా.. మెడికల్‌ వీసా వచ్చేలా డిప్యూటీ హైకమిషనర్‌ను ట్విటర్‌లో ఆదేశించింది. సుష్మా ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీద వీసా మంజూరు చేశారు. ఈ సంద‌ర్భంగానే ఆమె త‌మ దేశానికి ప్ర‌ధాని అయితే బాగుండేద‌ని ఆకాంక్షించారు.