Begin typing your search above and press return to search.

ఏపీ ప్రయోజనాల తర్వాతే ఇంకేమైనా.. తేల్చేసిన జగన్ సర్కారు

By:  Tupaki Desk   |   16 Nov 2019 6:11 AM GMT
ఏపీ ప్రయోజనాల తర్వాతే ఇంకేమైనా.. తేల్చేసిన జగన్ సర్కారు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతే తీసుకుంటే.. ఎంత స్నేహితుడైనా కావొచ్చు.. తొలుత తెలంగాణ ప్రయోజనాలు.. ఆ తర్వాతే ఇంకేమైనా అన్నట్లు వ్యవహరిస్తారు. తెలంగాణ ప్రయోజనాల్ని పక్కన పెట్టే ఏ పనిని చేయరు. మరి.. తెలంగాణ ముఖ్యమంత్రి కి ఉన్నంత కమిట్ మెంట్ ఏపీకి సీఎంగా వ్యవహరించిన చంద్రబాబుకు ఉండేది కాదన్న మాట అప్పట్లో వినిపించేది. దీనికి కారణం లేకపోలేదు. ఏపీ ప్రయోజనాల కోసం తెలంగాణ ను తప్పు పట్టాలన్నా.. ఫైట్ చేయాలన్నా అప్పట్లో బాబు ప్రభుత్వానికి తెలంగాణ లో ఉన్న పార్టీ అడ్డుగా ఉండేది.

కానీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఆ సమస్య లేదు. స్నేహితుడే కావొచ్చు.. కానీ ఏపీ ప్రయోజనాల తర్వాతే ఇంకేమైనా అన్న విషయాన్ని తాజాగా తన చేతల తో తేల్చి చెప్పింది ఏపీ సర్కారు. విభజన చట్టాన్ని అమలు చేయకుండా తెలంగాణ ఉల్లంఘిస్తుందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ సుప్రీం లో ఏపీ సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ సర్కారు చేస్తున్న ఉల్లంఘనలకు సంబంధించి ఏపీ సర్కారు వాదనలు ఏమంటే..
% రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రప్రభుత్వం పేర్కొన్న నియమనిబంధనలూ.. ప్రవర్తనా నియమావళిని తెలంగాణ సర్కారు పాటించడం లేదు. 9, 10 షెడ్యూల్‌ సంస్థల ఆస్తుల పంపకానికీ సహకరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల కోసం విడుదల చేసిన నిధులలోనూ వాటాలను ఇవ్వడం లేదు.

% విభజన చట్టం హామీల అమలు కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు .. సంబంధిత శాఖలు, కార్పొరేషన్ల అధికారులు కలసి మాట్లాడుకుందామని, ఈ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని కోరుతున్నా తెలంగాణ నుంచి సహేతుకమైన సమాధానం కానీ, సమావేశం తేదీ సమాచారంగానీ రావడం లేదు.

% కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల కోసం విడుదల చేసిన రూ.1630 కోట్లలో రూ.664.67 కోట్లు తమ వాటా కింద రావాలని తెలంగాణ వాదిస్తోంది. ఇప్పటికే రూ.169.46 కోట్లు తెలంగాణకు చెల్లించాం. ఇంకా రూ.495.21 కోట్లు మాత్రమే తెలంగాణకు ఇవ్వాల్సి ఉంది.

% రాష్ట్ర ఆర్థికసంస్థ ఆస్తుల విభజన విషయంలోనూ తెలంగాణ సహకరించడం లేదు. పోలవరం సాగు నీటి ప్రాజెక్టును నిర్మిస్తే 80 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణకు ఇవ్వాలని ఆ రాష్ట్రం చేసే వాదనలో వాస్తవం లేదు.

% గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన అపెక్స్‌ కౌన్సిల్‌ ను ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు సభ్యులు గా ఉన్నారు. ఈ కౌన్సిల్‌ సమావేశంలో పోలవరంపై తెలంగాణ చేసిన వాదనలు అసంబద్ధం గా ఉన్నాయి.

%పోలవరం సాగునీటి ప్రాజెక్టును నిర్మించాక .. కృష్ణా జలాల్లో ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటక 21 టీఎంసీలు, మహారాష్ట్ర 14 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో తెలంగాణ ప్రస్తావన లేదు. అయినా.. ఆ రాష్ట్రం తమకు 80 టీఎంసీల వాటా వస్తుందంటూ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించింది.
% పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించి 80 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు పంపడం వల్ల నాగార్జున సాగర్‌లో నీటి వాడకం తగ్గి.. శ్రీశైలం నుంచి రాయలసీమకు సాగు, తాగు నీటిని ఆమేరకు పంపేందుకు వీలు కలుగుతుంది.

%%మూడువేల టీఎంసీల గోదావరి జలాలు ఏటా సముద్రంలో కలుస్తున్నాయి. వాటిలో 80 టీఎంసీలను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పంపుతున్నాం. పోలవరం స్పిల్‌వే వెడల్పు వల్ల 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం బయటకు వెళ్లి.. ఎగువ ప్రాంతంలో ముంపు నష్టం తక్కువగా ఉంటుంది. దీనివల్ల తెలంగాణకే ప్రయోజనం.

% ముంపు గ్రామాలన్నీ ఏపీలోనే ఉన్నందున తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసేందుకు ఆస్కారమేలేదు. రాజోలి బండ ఆధునీకరణ వల్ల తెలంగాణకూ ప్రయోజనం ఉంటుంది. 85వేల ఎకరాలు సాగు స్థిరీకరణ జరుగుతుంది.

% విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోంది. కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు వంటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. గోదావరినదిపై కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులను అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండానే నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుల వల్ల 450 టీఎంసీల గోదావరి నీటిని తెలంగాణ వినియోగించుకోనుంది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలోని దిగువనున్న రైతులు నష్టపోతారు.

%తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై 2016 సెప్టెంబరు 21న కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించినా ఎలాంటి ప్రయోజనమూ లేదు. కాళేశ్వరం నిర్మాణాన్ని రాష్ట్రం వ్యతిరేకిస్తున్నా.. కేంద్ర జలమంత్రిత్వశాఖ సాంకేతిక సలహా మండలి క్లియరెన్సు ఇచ్చింది.