Begin typing your search above and press return to search.

ప్యాచ‌ప్ కోసం కిందామీదా ప‌డుతున్న చేత‌న్!

By:  Tupaki Desk   |   11 Oct 2018 5:12 AM GMT
ప్యాచ‌ప్ కోసం కిందామీదా ప‌డుతున్న చేత‌న్!
X
కోట్ల మందికి రాని ఇమేజ్ కొంద‌రికి మాత్ర‌మే వ‌స్తుంది. అలాంట‌ప్పుడు ఆ వ‌చ్చిన ఇమేజ్ ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల్సిన బాధ్య‌త స‌ద‌రు ప్ర‌ముఖుడి పైన ఉంటుంది. ఎందుకిలా అంటే.. నిత్యం నీతులు బోధించ‌ట‌మే ప‌నిగా ప్ర‌ముఖులు పెట్టుకుంటారు కాబ‌ట్టి. తాము చెప్పే ఆద‌ర్శాలు మాట‌ల‌కే ప‌రిమితం కాకుండా చేత‌ల్లోనూ చూపించాలి. ఒక‌వేళ చూపించ‌కుంటే.. ఏదో ఒక‌రోజు అందుకు త‌గ్గ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

కంటికి క‌నిపించ‌ని నైతిక‌త‌ను ఫాలో అయినంత వ‌ర‌కూ ఓకే. కానీ.. ఎప్పుడైతే దాన్ని మిస్ చేస్తామో అప్పుడు దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది. ప్ర‌పంచాన్ని ఒక ఊపు ఊపేస్తున్న మీటూ వ్య‌వ‌హారంలో తాజాగా ప్ర‌ముఖ ర‌చ‌యిత చేత‌న్ భ‌గ‌త్ తీరు గురించి నైతిక‌త అన్న‌ది కంటికి క‌నిపించ‌కున్నా.. దాన్ని మిస్ అయితే ఎన్ని తిప్ప‌ల‌న్న విష‌యం ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల క‌క్కుర్తి చెప్ప‌క‌నే చెప్పేసింది. తాజాగా ఆ జాబితాలో చేరారు ప్ర‌ముఖ ర‌చ‌యిత చేత‌న్ భ‌గ‌త్‌. నీతులు బోధించే అత‌గాడు.. ఒక మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై ప‌డిన మోజు.. ఆమెను ఆక‌ర్షించేందుకు అత‌గాడి విన్యాసాలు స్క్రీన్ షాట్ల రూపంలో బ‌య‌ట‌కు రావటం సంచ‌ల‌నం సృష్టించింది.

త‌న బ‌ల‌మైన అక్ష‌రాల‌తో స‌ద‌రు మ‌హిళా జ‌ర్న‌లిస్టును త‌నకు త‌గ్గ‌ట్లుగా తిప్పుకునే ప్ర‌య‌త్నం చేసినా.. ఆమె మాత్రం స‌సేమిరా అన‌ట‌మే కాదు.. మీకు పెళ్ల‌యిపోయిన విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ చుర‌క వేసిన వైనం ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే.

త‌న గుట్టు ర‌ట్టు కావ‌టం.. తన‌లోని క‌క్కుర్తి ప్ర‌పంచానికి తెలియ‌టంతో చేత‌న్ భ‌గ‌త్ చెంప‌లేసుకున్నాడు. మిగిలిన వారి మాదిరి కాకుండా త‌న త‌ప్పును తాను ఒప్పుకోవ‌ట‌మే కాదు.. తాను క‌క్కుర్తిగా వ్య‌వ‌హ‌రించిన మ‌హిళ‌తో పాటు.. త‌న జీవిత‌భాగ‌స్వామికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇక్క‌డితో ఈ వ్య‌వ‌హారం ముగిసి ఉంటే బాగుండేది.

ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యామో.. అప్పుడు త‌మ మాట‌ల‌తోనో.. చేత‌ల్లోనో జ‌రిగిన న‌ష్టానికి త‌గినంత ప్యాచ‌ప్ చేయాల‌న్న ఆత్రుత ఎక్కువ అవుతుంది. ఇందుకు తాను సైతం మిన‌హాయింపు కాద‌న్న విష‌యాన్ని చేత‌న్ త‌న తీరుతో చెప్పేశారు. తాజాగా ఆయ‌న ఫేస్ బుక్ మ‌రో వివ‌ర‌ణ ఇచ్చారు.

వేధించే త‌త్వం త‌న‌ది కాద‌ని.. తానెప్పుడూ అలా చేయ‌లేద‌ని.. చేయ‌ను కూడా అని గొప్ప‌లు చెప్పుకున్నారు. వివాదాస్ప‌ద‌మైన మేసేజ్ పంపిన‌ప్పుడే ఆ మ‌హిళ‌కు.. త‌న భార్య‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాన‌ని.. ముగిసిపోయిన వ్య‌వ‌హారంలోకి తిరిగి లాగ‌టం స‌రికాద‌న్నారు. త‌న‌దంతా వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మ‌ని.. చ‌ట్టం కోణంలో తానేమీ త‌ప్పు చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అయ్యా చేత‌న్ జీ.. ప్ర‌ముఖులకు ప్రైవేటు వ్య‌వ‌హారం అంటూ ఏమీ ఉండ‌ద‌ని అప్పుడెప్పుడో మా విప్ల‌వ క‌వి తేల్చి చెప్పేశారు. అయినా.. ప్రైవేటు వ్య‌వ‌హార‌మే అయి ఉంటే.. మీరు ప‌బ్లిక్ గా ఇంత భారీగా వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉందంటారా?