Begin typing your search above and press return to search.

కష్టమొచ్చి డయల్ 100కు ఫోన్ చేస్తే.. తన్ని స్టేషన్ కు తీసుకెళ్లారట

By:  Tupaki Desk   |   23 Dec 2019 11:09 AM GMT
కష్టమొచ్చి డయల్ 100కు ఫోన్ చేస్తే.. తన్ని స్టేషన్ కు తీసుకెళ్లారట
X
దేశ వ్యాప్తంగా దిశ హత్యాచార సంఘటన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు మేధావులు.. బుద్ధజీవులు చిత్రవిచిత్రమైన వాదనలు వినిపించారు. కష్టంలో ఉన్నానని అనిపించినప్పుడు డయల్ 100కు ఫోన్ చేయాల్సిందే తప్పించి దిశ తన సోదరికి ఫోన్ చేయటం ఏమిటి? అంటూ ప్రశ్నించటం తెలిసిందే. హోంమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శ వినిపించాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా డయల్ 100కు ఫోన్ చేసిన హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ చక్కగా నిద్రపోతుంటే డయల్ 100కు ఫోన్ చేసి డిస్ట్రబ్ చేస్తావా? అంటూ మండిపడటమే కాదు.. తిట్ల దండకంతో పాటు తన్ని.. రివర్స్ గేర్ లో స్టేషన్ కు తీసుకుపోయిన విచిత్రమైన ఉదంతం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

జీడిమెట్లలోని హెచ్ఎఎల్ కాలనీకి చెందిన ఒక యువకుడు సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేశారు. అల్లరిముకలు ఇబ్బంది పెడుతున్నారని ఫోన్ చేశాడు. ఈ సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు అక్కడకు చేరుకొని అల్లరిమూకను చెదరగొట్టాడు. ఇదిలా ఉంటే.. అక్కడున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు మాత్రం డయల్ 100కు ఫోన్ చేసిన యువకుడిపై తిట్ల దండకం అందుకున్నారు.

ఫోన్ చేసిన యువకుడికి మళ్లీ ఫోన్ చేశారు. ఆ యువకుడి ఇంటి అడ్రస్ తెలుసుకొని వెళ్లటమే కాదు.. ఇంట్లో నుంచి బయటకు పిలవటమే కాదు.. అర్థరాత్రి నిద్ర చెడగొడతావ్రా? అంటూ తిట్ల దండకం అందుకోవటమే కాదు.. నాలుగు పీకి స్టేషన్ కు తీసుకెళ్లారు. తమ అబ్బాయి కనిపించకపోవటంతో కుర్రాడి తల్లిదండ్రులు అతడి ఫోన్ కు ఫోన్ చేశారు. ఫోన్ మాట్లాడకుండా కానిస్టేబుల్ కోటేశ్వరరావు అతడి ఫోన్ ను లాక్కున్నాడు.

అయితే.. తమకు సమాచారం అందించిన వ్యక్తి మీడియాలో పని చేస్తున్న విషయాన్ని తెలుసుకొన్న సదరు కానిస్టేబుల్ నాలుక్కర్చుకొని.. సారీ చెప్పి ఇంటి వద్ద దింపి వెళ్లాడు. జరిగిన ఉదంతంపై డీజీపీ మహేందర్ రెడ్డి.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు కంప్లైంట్ చేశారు. డయల్ 100కు ఫోన్ చేస్తే ఇలా చేస్తారా? అంటూ మండిపడుతున్నారు. తమకు అందిన ఫిర్యాదుపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ హామీ ఇచ్చారు. తాజా పరిణామాన్ని చూసినప్పుడు డయల్ 100కు ఫోన్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతే చేయాలన్న భావన కలుగకమానదు.