Begin typing your search above and press return to search.

ఈటలకు రసమయి తోడు వచ్చాడుగా?

By:  Tupaki Desk   |   6 Sep 2019 5:25 AM GMT
ఈటలకు రసమయి తోడు వచ్చాడుగా?
X
బాస్ మీద ఉన్న గుర్రు గులాబీ నేతల నోటి మాటలతో చెప్పేస్తున్నారు. నిన్నటి వరకూ కడుపులోనే దాచుకున్నోళ్లు ఒక్కొక్కరూ తాజాగా బయటపడుతుననారా? తెలంగాణ ఉద్యమ నేతలుగా.. బంగారు తెలంగాణ కలలు కన్న వారంతా.. పెద్దసారు పాలన మీద అసంతృప్తితో ఉన్నారా? అయితే.. తమ మనసులోని భావాల్ని మాటల రూపంలో బయటకు చెప్పే సాహసం చేయలేకపోతున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్న వేళ.. ఈ మౌనాన్ని బ్రేక్ చేస్తూ.. మంత్రి ఈటల రూపంలో బయటకొచ్చిన గొంతు గులాబీదళంలో కలకలంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ కలకలం ఒక కొలిక్కి రాక ముందే రసమయి బాలకిషన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణ రాష్ట్రంతో ఎన్నో మార్పులు తాను అనుకున్నప్పటికీ.. గడిచిన ఐదేళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదన్న సంచలన వ్యాఖ్యల్ని చేశారు. అంతేనా.. తెలంగాణ ఒక్కటే మారింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అవే పరిస్థితులు ఉన్నాయి.. ఇన్నేళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఉండటం ఆశ్చర్యంగా ఉందంటూ అసలు విషయాన్ని ఓపెన్ చేసేశారు.

ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. కానీ.. అదే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసే ధైర్యం.. సాహసం ఎవరికి లేని వేళ.. అందుకు భిన్నంగా రసమయి ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రసమయి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎలాంటి మార్పు రాలేదన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కంటే తనకు ఉపాధ్యాయ జీవితమే గొప్ప సంతృప్తి ఇచ్చిందన్నారు. ఆటపాటలతో అలరించిన రసమయి.. తాను మాట్లాడిన సందర్భంలో చేసిన కీలక వ్యాఖ్యల్ని చూస్తే..

% ‘‘ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సిద్దిపేట జిల్లా ఇంద్రగూడెం పాఠశాలకు వెళ్లాను. 19 సంవత్సరాల కింద అక్కడే నేను ఉపాధ్యాయుడిగా పని చేశాను. దాంతో.. ఒకసారి మా ఊరికి.. స్కూల్ కు రావాలని కోరడంతో వెళ్లాను. ఇన్నేళ్ల తర్వాత ఆ పాఠశాలకు వెళితే అక్కడ ఏమీ మార్పు కనిపించలేదు. నేను టీచర్‌గా ఉన్నప్పుడు ఒకటే తరగతి గది - ఒకటే కుర్చీ - ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండేవారు. అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. కానీ.. బోర్డుపై మాత్రం ‘ఆంధ్రప్రదేశ్‌’కు బదులు ‘తెలంగాణ’ ఒక్కటే మారింది. తెలంగాణవచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అవే పరిస్థితులు ఉన్నాయి. నాకు ఆశ్చర్యమేసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఉండడం ఆశ్చర్యంగా ఉంది.

% మీరేమీ అనుకోకండి. రసమయి ప్రభుత్వంలో ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నాడని. రాజేందరన్నకు.. నాకు వాస్తవాలు మాట్లాడడమే వచ్చు. కడుపులో ఏమీ దాచుకోం. మాట్లాడకుంటే పొట్ట ఊర్కోదు. ఇవతలకు రా అంటుంది.

% ఉద్య మం నుంచి వచ్చినోళ్లం. వాస్తవాల మీద ఉద్యమాలను నడిపినోళ్లం. తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలని కలలుకన్నాము. వాస్తవంగా ఒక్కోసారి బాధనిపిస్తోంది. చాలా బాధనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి మార్పు రాలేదు.

% రోజురోజుకు మారుతున్న సమాజంలో దేనికైనా బాధ్యులను చేస్తున్నది ఉపాధ్యాయులనే. ఎమ్మెల్యేగా ఉన్నా.. ఎవరైనా ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తే నాకు బాధగా ఉంటుంది. నేను ఇంకా ఉపాధ్యాయుడిగానే భావిస్తున్నా. ఉపాధ్యాయ ఉద్యోగం వట్టిగా రాదు. ఉపాధ్యాయుడికి రోజూ పరీక్షే! ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు వస్తలేరంటే.. ఏముందని వస్తరు!? వాటిలో మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత మనపైనే ఉంది.

% బీఈడీ - డీఎస్సీ రాయడం ఐఏఎస్‌ కంటే కూడా కష్టం. రెసిడెన్షియల్‌ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయి. గొప్పగా చదువుకోవాలనే ఆలోచనతోపాటు కడుపునిండా తినాలనే ఆలోచన చేసిందన్న ఈటల రాజేందర్‌. హాస్టల్‌లో అన్నం కోసం గిన్నె పట్టుకొని పోరాటం చేసిన బిడ్డ మంత్రి అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో అందుకు రాజేందర్‌ ఉదాహరణ. రసమయి ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడడు. వాస్తవాలే మాట్లాడతాడు.

% పంటంత కోసుకు పోయినంక పరిగ ఏరుకున్నట్లు మన తెలంగాణ పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు వెళ్తున్నాం. సీఎం కేసీఆర్‌ కు ప్రజలకు.. ఉపాధ్యాయులకు ఏమి అవసరమో తెలుసు. ఉపాధ్యాయులు.. గురువులంటే ఆయనకు అపారమైన గౌరవం. మీ సమస్యలు తెలుసు. వాటిపై ఆయనకు అవగాహన ఉంది.