Begin typing your search above and press return to search.

సిసలైన క్విడ్ ప్రోకో..సింధియాపై ఫోర్జరీ కేసు క్లోజ్

By:  Tupaki Desk   |   25 March 2020 4:09 AM GMT
సిసలైన క్విడ్ ప్రోకో..సింధియాపై ఫోర్జరీ కేసు క్లోజ్
X
ఆర్థిక సంబంధిత నేరాల్లో క్విడ్ ప్రోకో పేరు మనం వింటూనే ఉంటాం. అయితే ఆర్థిక రంగంలో కంటే కూడా రాజకీయ రంగంలో ఈ తరహా పరిణామాలు చాలానే చోటుచేసుకుంటున్నా... వాటిపై కేసులు ఉండవు. దర్యాప్తు అసలే ఉండదు. ఈ వాదనకు నిలువెత్తు నిదర్శనం మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి... ఈ మధ్యే ఆ పార్టీకి హ్యాండిచ్చేసి.. బీజేపీలోకి చేరిపోవడమే కాకుండా... మధ్యప్రదేశ్ లోని బీజేపీ సర్కారును కూలదోసేసి... కొత్తగా శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ సర్కారుకు బాటలు వేసిన యువ రాజకీయవేత్త జ్యోతిరాధిత్య సింధియా ఉదంతం నిలుస్తోందని చెప్పాలి. కాంగ్రెస్ సర్కారును చంపేసి... బీజేపీకి సాయపడ్డ సింధియాపై గతంలో నమోదైన ఓ ఫోర్జరీ కేసు అప్పటికప్పుడు రద్దైపోయింది.

ఈ వ్యవహారం వివరాల్లోకెళితే... జ్యోతిరాదిత్య సింధియా - ఆయన కుటుంబ సభ్యులపై మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) ఫోర్జరీ కేసు నమోదు చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 2009లో గ్వాలియర్‌ లోని భూమిని అమ్మినట్టు అప్పట్లో వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ దశలోనే ఉంది. అయితే ఈ నెల 10న సింధియా కాంగ్రెస్‌ ను వీడారు. అనంతరం బీజేపీలో చేరి మధ్యప్రదేశ్‌ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడిన తర్వాత ఆయన మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. దీంతో కమల్‌ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది.

ఈ క్రమంలో ఈ నెల 12న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2009లో సింధియా - ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన ఫోర్జరీ కేసు విషయంలో నిజనిర్ధారణ చేయాలని ఈవోడబ్ల్యూ నిర్ణయించింది. ఈ నెల 12న ఫిర్యాదుదారు సురేంద్ర శ్రీవాస్తవ తమను సంప్రదించాడని - సింధియాలపై నమోదైన కేసు విషయం మరోమారు పరిశీలించాలని కోరారని ఈవోడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఈ అభ్యర్థన మేరకు ఆయన ఫిర్యాదును తాము గ్వాలియర్ కార్యాలయానికి పంపగా - వారు తిరిగి విచారణ జరిపి కేసును క్లోజ్ చేయాలని సూచించారట. దీంతో సింధియా - ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన కేసును శుక్రవారమే మూసివేసినట్టు తెలిసింది. అదే రోజున కమల్‌ నాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. సోమవారం రాత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.