Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి అశోక హారం

By:  Tupaki Desk   |   6 May 2016 4:16 PM GMT
అమ‌రావ‌తికి అశోక హారం
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త రాజ‌ధాని ప‌రిశ్ర‌మ‌ల్ని బాగానే ఆక‌ర్షిస్తోంది. ఇంకా అక్క‌డ ఏ ర‌క‌మైన అభివృద్ధీ జ‌ర‌గ‌న‌ప్ప‌టికీ.. భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకుని ప్ర‌ముఖ పారిశ్రామిక సంస్థ‌లు ప‌రుగులు పెడుతున్నాయి. ఇప్ప‌టికే ఐటీసీ సంస్థ త‌మ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తి స‌మీపంలోని గుంటూరు జిల్లాకు త‌ర‌లించ‌గా.. ఆటోమొబైల్ దిగ్గ‌జ అశోక్ లేలాండ్ సంస్థ అక్క‌డ భారీ స్థాయిలో ఆటోమొబైల్ ప‌రిక‌రాల సంస్థ‌ను నెల‌కొల్ప‌బోతోంది. కృష్ణా జిల్లాలో రాజ‌ధానికి అత్యంత స‌మీపంలో మ‌ల్ల‌ప‌ల్లి గ్రామంలో అశోక్ లేలాండ్ బాడీ బిల్డింగ్ ప్లాంటు ఏర్పాటు కాబోతోంది.

ఇప్ప‌టికే అశోక్ లేలాండ్ ప్ర‌తినిధుల‌కు.. ఏపీఐఐసీకి మ‌ధ్య ఒప్పందం కూడా కుదిరిన‌ట్లు స‌మాచారం. రూ.1000 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు పెట్ట‌డానికి సిద్ధ‌మైన అశోక్ లేలాండ్ సంస్థ ఇందుకోసం 300 ఎక‌రాల‌కు పైగా స్థ‌లం కోరింది. స్థ‌లంతో పాటు రాయితీలు కూడా ఇవ్వ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. కృష్ణా జిల్లాలో రాజ‌ధానికి స‌మీప ప్రాంతాల్లో మొత్తంగా 3200 ఎక‌రాల దాకా స్థ‌లం ఏపీఐఐసీ అధీనంలో ఉంది.

రాజ‌ధాని ఎద‌గాలంటే పారిశ్రామికాభివృద్ధి కీల‌కం కావ‌డంతో భూముల‌తో పాటు అనేక రాయితీలిచ్చి ప‌రిశ్ర‌మ‌ల్ని ఆహ్వానించాల‌ని చంద్ర‌బాబు స‌ర్కారు భావిస్తోంది. అశోక్ లేలాండ్ లాంటి పెద్ద సంస్థ రాక‌తో.. మిగ‌తా సంస్థ‌ల దృష్టి కూడా అమ‌రావ‌తి మీద ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది.