Begin typing your search above and press return to search.

కేటీఆర్ ట్వీట్ చేశాక.. డెలివరీల మీద డీజీపీ తాజా హామీ

By:  Tupaki Desk   |   23 May 2021 11:30 AM GMT
కేటీఆర్ ట్వీట్ చేశాక.. డెలివరీల మీద డీజీపీ తాజా హామీ
X
లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయండి.. రెండురోజుల క్రితం వరంగల్ లో నిర్వహించిన హైలెవల్ రివ్యూలో సీఎం కేసీఆర్ ఆదేశం. ముఖ్యమంత్రే స్వయంగా కఠినంగా వ్యవహరించనమన్న తర్వాత.. తెలంగాణలో లాక్ డౌన్ అమలు ఎలా ఉంటుందన్న దానికి శాంపిల్.. శనివారం చూపించేశారు. ఈ దెబ్బకు భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా డెలివరీ బాయస్ ను ఎలా ఆపుతారు? కొవిడ్ వేళ.. ఆహారాన్ని పంపిణీ చేసే డెలివరీ బాయస్ విషయంలో పోలీసుల తీరు ఏ మాత్రం బాగోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇక.. ఫుడ్ సప్లై చేసే వారైతే.. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసులు ఇలా అభ్యంతరం వ్యక్తం చేయటమేమిటంటూ మండిపడ్డారు.

తమ ఫిర్యాదుల్ని మంత్రి కేటీఆర్ ముందుకు వెళ్లేలా సోషల్ మీడియాలోనూ.. వివిధ మార్గాల్లో తీసుకెళ్లారు. దీనికి తోడు భారీ చలానాలు.. వాహనాల్ని సీజ్ చేయటంతో పలు వర్గాల నుంచి పెద్ద ఎత్తున విన్నపాలు అందాయి. ఈ నేపథ్యంలో.. శనివారం రాత్రి స్పందించిన కేటీఆర్.. డెలివరీ బాయస్ కు సంబంధించి తమ వరకు చాలా కంప్లైంట్లు వచ్చాయని.. డీజీపీగారితో మాట్లాడతామని ఆయన చెప్పారు. అన్నట్లే.. రోజు తిరిగేసరికి తెలంగాణ డీజీపీ ట్విటర్ అకౌంట్ లో తాజా అప్డేట్ ఇచ్చేశారు.

కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తూనే.. పుడ్ డెలివరీ.. ఈ-కామర్స్ సేవల్ని యథాతధంగా కొనసాగుతాయన్న హామీని ఇచ్చారు. అత్యవసర రాకపోకలు సాగించే వారిని అడ్డుకోమని డీజీపీ తన ట్వీట్ తో స్పష్టం చేశారు. అంతేకాదు.. దీనికి సంబంధించిన ఆదేశాల్ని హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల (హైదరాబాద్.. సైబరాబాద్.. రాచకొండ)కు సమాచారం అందించారు. దీంతో.. ఈ రోజు (ఆదివారం) నుంచి పుడ్ డెలివరీ బాయిస్ తో పాటు.. అత్యవసర సేవలు.. ఈ-కామర్స్ సేవల డెలివరీలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేసిన తర్వాత మార్పు రాకుండా ఉంటుందా చెప్పండి?