Begin typing your search above and press return to search.

ఇక‌, ఏపీలోకి క‌ర్ణాట‌క నుంచి పెట్రోల్‌, డీజిల్ స్మ‌గ్లింగ్‌!!

By:  Tupaki Desk   |   9 Nov 2021 1:30 AM GMT
ఇక‌, ఏపీలోకి క‌ర్ణాట‌క నుంచి  పెట్రోల్‌, డీజిల్ స్మ‌గ్లింగ్‌!!
X
ఏపీలోకి ఇప్ప‌టి వ‌ర‌కు పొరుగు రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల నుంచి మ‌ద్యం స్మ‌గ్లింగ్ అవుతున్న‌వార్త‌లు విన్నారు. ఏపీలో ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌డం.. ప్ర‌జ‌ల‌కు అలవాటైన సంప్ర‌దాయ బ్రాండ్లు లేక‌పోవ‌డంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యాన్ని ర‌వాణా చేసుకుని..ఏపీలో విక్ర‌యించే ముఠాలు ఏర్ప‌డ్డాయి. దీనికి వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న మ‌ద్యం పాల‌సీనే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ‌లో మ‌ద్యం ధ‌ర‌లు చాలా చౌక‌. దీంతో ఏపీ, తెలంగాణ స‌రిహ‌ద్దు ప్రాంతాల‌కు చెందిన మ‌ద్యం అలవాటు ఉన్న ప్ర‌జ‌లు.. తెలంగాణ‌లోకి వెళ్లి మ‌ద్యం తాగి వ‌స్తున్నారు. కొంద‌రు కొన్ని బాటిళ్ల‌ను కొనుగోలు చేసుకుని వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తొలుత మూడు బాటిళ్ల‌ను తెచ్చుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. అవి ఏసైజు బాటిళ్ల‌యినా.. అనుమ‌తించింది. అయితే.. గ‌త ఏడాది చివ‌రిలో.. ఈ మూడు బాటిళ్ల‌ను కూడా బ్యాన్ చేస్తూ..ఉత్త‌ర్వులు ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ.. వివిధ మార్గాల్లో మ‌ద్యం బాటిళ్ల ప్ర‌వాహం మాత్రం ఆగ‌లేదు. దీనికి ప్ర‌ధానంగా వైసీపీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన మ‌ద్యం విధానమేన‌న్న‌ది మ‌ద్యం ప్రియుల వాద‌న‌. ఇదిలావుంటే.. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌రో చిక్కు వ‌చ్చి ప‌డింది. పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు ఏపీలో గూబ గుయ్ మ‌నేలా ఉన్నాయి. కేంద్రం ధ‌ర‌లు త‌గ్గించినా.. ఏపీలో మాత్రం వీటి ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌క‌పోగా..కేంద్రంపై దాడి చేస్తున్నారు.

ఇటీవ‌ల దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని కేంద్రం పెట్రోల్ పై రూ. 5 , డీజిల్‌పై రూ.10 వ‌ర‌కు త‌గ్గింపు ప్ర‌క‌టించింది. దీంతో ప‌లు రాష్ట్రాలు ఈ బాట‌లో న‌డిచి..వ్యాట్‌ను కోత వేసుకున్నాయి. ఫ‌లితంగా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌తో ఆ రాష్ట్రంలో పెట్రోల ధ‌ర రూ.12 , డీజిల్ ధ‌ర రూ.17 వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టింది. కానీ, ఏపీలో ఎలాంటి మార్పూ క‌నిపించ‌డం లేదు. దీంతో క‌ర్ణాట‌క‌లోని పెట్రో బంకుల య‌జ‌మానులు ఏపీ వాహ‌న‌దారుల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ స‌రిహ‌ద్దుల్లోని రాళ్ల‌బుడుగూరు ప్రాంతంలో క‌ర్ణాట‌క‌కు చెందిన కెంపేపుర స‌రిహ‌ద్దు ఉంది. ఇక్క‌డి బంకు య‌జ‌మానులు.. ఏపీలోను, త‌మ వ‌ద్ధ ఉన్న ధ‌ర‌ల‌ను పోలుస్తూ..క‌ర‌ప‌త్రాల‌ను ముద్రించారు.

వీటిని తెలుగులో నే ముద్రించి.. ఏపీలో కంటే..త‌మ‌ద‌గ్గ‌రే పెట్రోల్ ధ‌ర‌లు త‌క్కువ‌ని.. కాబ‌ట్టి .. త‌మ వ‌ద్ద పెట్రోల్ కొనుగోలు చేయాల‌ని కోరుతున్నారు. ఇదే త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌లు తెలంగాణ‌లోనూ క‌నిపిస్తున్నాయి. అక్క‌డ పాంప్లేట్స్ కాక‌పోయినా.. బ్యాన‌ర్లు క‌డుతున్నారు. దీంతో ఇక్క‌డ పెట్రో బిజినెస్ జోరుగా సాగుతోంది. గ‌తంలో రోజుకు 3000-5000 లీట‌ర్లు అమ్మే ఈ బంకులు.. ఇప్పుడు రోజుకు 15000 నుంచి 18000 లీట‌ర్ల చొప్పున విక్ర‌యిస్తున్నారు. గ‌త మూడు రోజులుగా న‌మోదైన రికార్డు ఇది.

అదేస‌మ‌యంలో ఏపీ స‌రిహ‌ద్దు ప్రాంతంలో.. మొబైల్ విక్ర‌య‌దారులు కూడా పెరిగిపోయారు. క‌ర్ణాట‌క నుంచి తెస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ను వారు ఏపీ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో విక్ర‌యిస్తున్నారు. ఇది.. ఏపీ ఖ‌జానాకు తీవ్ర శ‌రాఘాతంగా మారింది. క‌ర్ణాట‌క‌లో ధ‌ర‌లు త‌గ్గించి.. కొంత మేర‌కు న‌ష్ట‌పోతున్నా.. ఎక్కువ మొత్తంలో పెట్రోల్‌, డీజిల్‌ను విక్ర‌యిస్తూ.. ఆ న‌ష్టాన్ని లాభాల రూపంలో మ‌లుచుకుంటోంది. ``జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం.. క‌ర్ణాట‌క బంకు య‌జ‌మానుల‌కు వ‌రంగా మారింది`` అని కొంద‌రు చెబుతున్నారు.

ఇక‌, ఇదే విష‌యం.. సోష‌ల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. మ‌ద్యంపై నిఘా పెట్టిన‌ట్టే.. స‌రిహ‌ద్దుల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెట్రోల్ ట్యాంకుల‌పైనా నిఘా పెడుతుందా? పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొనేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటుందా? పెట్రోల్‌ట్యాంకులను కూడా ఇటు నుంచి వెళ్లేప్పుడు.. అటు నుంచి వ‌చ్చేప్పుడు త‌నిఖీ చేస్తుందా? అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు నెటిజ‌న్లు. లేక‌పోతే.. క‌ర్ణాట‌క నుంచి ఏపీలోకి వ‌చ్చే వాహ‌నాలు.. కేవ‌లం 10 లీట‌ర్ల‌కు మించి పెట్రోల్‌, లేదా డీజిల్‌తో రాకూడ‌ద‌ని.. జ‌గ‌న్ స‌ర్కారు ఏమైనా నిబంధ‌న‌లు పెడుతుందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి మ‌ద్యం మాదిరిగానే పెట్రో కూడా జ‌గ‌న్ స‌ర్కారుకు త‌ల‌నొప్పిగా మారింద‌ని చెబుతున్నారు.