Begin typing your search above and press return to search.

మోడీగారి దుకాణం.. విజ‌య‌వాడ విమానాశ్ర‌యం అమ్మ‌బ‌డును!

By:  Tupaki Desk   |   6 Sep 2021 8:08 AM GMT
మోడీగారి దుకాణం.. విజ‌య‌వాడ విమానాశ్ర‌యం అమ్మ‌బ‌డును!
X
``ఈ దేశాన్ని తాక‌ట్టు పెట్టేందుకు.. కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంది. గుజ‌రాత్‌లో అనేక వేల మందికి ఉపాధి క‌ల్పి స్తున్న సంస్థ‌ల‌ను కూడా లీజుకు ఇచ్చేందుకు, వాటా తగ్గించుకునేందుకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం య‌త్నిస్తోంది`` - 2011-12 మ‌ధ్య అప్ప‌టి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న ప్ర‌స్తుత ప్ర‌ధాని నేరేంద్ర మోడీ దేశ‌వ్యాప్తంగా ఇచ్చిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ల్లో గుప్పించిన విమ‌ర్శ‌లు!

కాంగ్రెస్‌కు మ‌సిపూసి..

దీంతో కాంగ్రెస్‌ను కాద‌ని.. మోడీకి ఈ దేశ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. మ‌రి ఇప్పుడు జ‌రుగుతోంది ఏంటి? వాళ్లు లీజుకు ఇస్తే.. మోడీ ఇప్పుడు ఏకంగా అమ్మేస్తున్నారు. ఇటీవ‌ల న‌వ‌ర‌త్న కంపెనీల్లో ఒక‌టైన విశాఖ ఉక్కును అమ్మ‌కానికి పెట్టిన‌ట్టే.. ఇప్పుడు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఉన్న విజ‌య‌వాడ విమానాశ్ర‌యాన్ని, రాజ‌మండ్రి విమానాశ్ర‌యాల‌ను కూడా అమ్మ‌కానికి పెడుతున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదీ.. కారు చౌక‌గానే..

విశాఖ ఉక్క ఫ్యాక్ట‌రీ 40 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఉంటే.. దానిని కేవ‌లం 32 వేల కోట్ల‌కు అమ్ముతున్న‌ట్టుగానే.. విజ‌య‌వాడ విమ‌నాశ్ర‌యాన్ని కూడా కారు చౌక‌గా అమ్మే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రూ.3 వేల కోట్ల పెట్టుబడులు, రూ.6 వేల కోట్ల స్థిర, చరాస్తులతో ఉన్న ఈ ఎయిర్‌పోర్టును కేవలం రూ.600 కోట్లకు అప్పగించేందుకు కేంద్రం నిర్ణయించింది. 2024 నాటికి ప్రైవేటీకరణ బాట పట్టించే ప్రైవేటుకు విమానాశ్రయాల్లో రెండోదిగా విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ పేరును జాబితాలో చేర్చారు. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఎంతో వృద్ధిని సాధించటానికి అవకాశం ఉన్న విజయవాడ ఎయిర్‌పోర్టును కార్పొరేట్‌ సంస్థల కోసం కారుచౌకగా తెగనమ్మే ప్రతిపాదన తీసుకురావటం మోడీకే చెల్లింద‌ని అంటున్నారు.

ఏపీకి విశాఖ త‌ర్వాత‌.. విజ‌య‌వాడే!

దశాబ్దకాలంగా విజయవాడ విమానాశ్రయం వృద్ధి చెందుతూ వస్తోంది. ఏపీ విభ‌జ‌న, రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఏర్ప‌డిన త‌ర్వాత‌.. విజ‌య‌వాడ విమానాశ్ర‌యం శ‌ర‌వేగంగా అభివృద్ధి సాధించింది. 2017లో ఇక్కడి నుంచి 10 ల‌క్ష‌ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. రోజుకు 60 విమానాలు రాకపోకలు సాగించే పరిస్థితి ఉంది. అంతర్జాతీయయానానికీ ఇక్కడ డిమాండ్‌ ఉందని సింగపూర్‌ సర్వీస్‌ తేటతెల్లం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు విజయవాడ విమానాశ్రయం దగ్గరగా ఉండటంతో భవిష్యత్తులో విదేశీయానానికి డిమాండ్‌ ఉండే అవకాశాలున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా పాత టెర్మినల్‌ను ఆధునికీకరించారు.

న‌మ్మించి ద్రోహం!

రాష్ట్ర విభజన తర్వాత దేశంలోని మెట్రోపాలిటన్‌ ఎయిర్‌పోర్టులకు ధీటుగా విజయవాడ విమానాశ్రయం వృద్ధిని నమోదు చేసింది. ప్రయాణికులు 10 లక్షల మందే అయినా వృద్ధి మాత్రం బాగా సాధించింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా దృష్టి సారించింది. ఏఏఐ ప్రతిపాదించిన అన్నింటినీ ఆమోదిస్తూ వస్తోంది. కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు క్లియరెన్సులు వస్తుండేవి. విభజిత రాష్ట్రంపై కేంద్రం జాలి చూపిస్తుందని అనుకున్నారే తప్ప, దురాలోచన ఉందన్నది ఇప్పుడు స్పష్టమైంది.

ఎందుకు అమ్మాలి?

2030 నాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న‌ దేశాల్లో సంస్క‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌నేది .. ప్ర‌పంచ బ్యాంకు నిర్దేశం. అయితే.. దీనిని అమ‌లు చేయాలా? వ‌ద్దా? అనేది దేశాల ఇష్టానికే వ‌దిలేసింది. ఈ నేప‌థ్యంలో మోడీ స‌ర్కారు(భార‌త ప్ర‌భుత్వం ఏదైనా) దీనికి త‌లొగ్గింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యాన్ని త‌గ్గించుకుంటూ వ‌స్తున్నారు. వ‌చ్చే 2030 నాటికి దాదాపు ప్ర‌భుత్వ వాటా త‌గ్గిపోయి..కార్పొరేట్ వాటా పెంచ‌డం ద్వారా.. ఉద్యోగులు, పింఛ‌న్లు.. పీఎఫ్‌.. త‌దిత‌ర అన్ని బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించుకునే వ్యూహం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.