Begin typing your search above and press return to search.

మోదీ సాబ్... సౌత్ ఏకమవుతోందండీ

By:  Tupaki Desk   |   21 Oct 2019 12:43 PM GMT
మోదీ సాబ్... సౌత్ ఏకమవుతోందండీ
X
నిజమే... ఇప్పుడు సౌత్ మొత్తం ఏకమయ్యేలానే కనిపిస్తోంది. రాజకీయంగా కాకపోయినా... ఈ ఐక్యత కేవలం సినీ రంగానికి చెందినదే అయినా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి - ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీకి ముచ్చెమటలు పట్టించే అంశమేనని చెప్పక తప్పదు. సినీ రంగమంటూ ఒక్క బాలీవుడ్డేనన్న రీతిలో సాగుతున్న మోదీపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కొణిదెలకు ఇప్పుడు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కుష్బూ కూడా జత కలిసింది.

సినీ ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదంటూ ఉపాసన ట్విట్టర్ వేదికగా సంధించిన ఓ కామెంట్ నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే ప్రధాని హోదాలో మోదీ తన నివాసంలో ‘చేంజ్ విత్ ఇన్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు కదా. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులు - టీవీ ఆర్టిస్టులకు మాత్రమే ఇన్విటేషన్లు అందాయి. దీంతో వారు మాత్రమే హాజరయ్యారు. గాంధీ ఆశయాల గురించి - ఎలా వాటిని నెరవేర్చాలి అనే విషయాలపై చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం బాలీవుడ్ నటీనటులు అంతా ప్రధాని మోడీతో కలిసి ఫోటోలు దిగారు. సల్మాన్ ఖాన్ వంటి హీరోలు అందుబాటులో లేకపోవడంతో హాజరు కాలేదు.

ఇటు సోషల్ మీడియాతో పాటు అటు మెయిన్ మీడియాలోనూ ఈ ఫొటోలు కనిపించినంతనే ఉపాసన తనదైన శైలిలో స్పందించారు. ‘ఛేంజ్ విత్ ఇన్’ కార్యక్రమంపై ఉపాసన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. నటీనటులంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదని, సౌత్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఉందని, సౌత్ స్టార్స్ కు కూడా ఆహ్వానం పంపితే బాగుండేదని అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఉపాసన వాదనకు మద్దతుగా నిలిచిన కుష్బూ మోదీని మరింతగా టార్గెట్ చేశారు. ప్రభుత్వానికి బాలీవుడ్ ఒక్కటే ఆదాయం తీసుకురావడం లేదని, సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆదాయం వస్తోందని, సౌత్ స్టార్స్ ను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించి ఉంటె ఇంకా బాగుండేదని కుష్బూ పేర్కొన్నారు. మొత్తంగా మోదీపై ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఏకమయ్యేలానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.