Begin typing your search above and press return to search.

వైరస్ దెబ్బ ...రైల్వే జోన్‌కు మళ్లీ బ్రేక్ !

By:  Tupaki Desk   |   21 Jun 2020 12:00 PM GMT
వైరస్ దెబ్బ ...రైల్వే జోన్‌కు మళ్లీ బ్రేక్ !
X
ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న రైల్వే జోన్‌ ఇప్పట్లో ఏర్పాటయ్యే సూచనలు కనిపించడం లేదు. దశాబ్దాల పోరాట ఫలితంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొన్న ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ జోన్‌ కోసం రూ.235 కోట్లు కేటాయించింది. ఇది చాలా తక్కువ మొత్తమని, దేనికీ సరిపోదని అప్పట్లోనే అన్ని రాజకీయ పార్టీలు విమర్శించాయి. బడ్జెట్‌ విడుదలలో భాగంగా కేంద్రం రూ.3 కోట్లు విడుదల చేసి రాయగడ డివిజన్ లో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ఆ పనులు ప్రారంభించేలోగా వైరస్ మహమ్మారి వచ్చిపడింది.

దీనితో రైల్వేలో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. మార్చి నెలాఖరు నుండి జూన్‌ వరకు పూర్తిగా అన్నీ స్తంభించిపోయాయి. జూన్‌లో నామమాత్రంగా ప్రయాణికుల రైళ్లు నడుపుతున్నారు. శ్రామిక్‌ రైళ్ల వల్ల పైసా ఆదాయం లేదు. మరోవైపు రవాణాకు ఉద్దేశించిన గూడ్సు రైళ్లు కూడా తగ్గిపోయాయి. సరకులు ఎత్తి, దించే కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోవడం, అనేక పరిశ్రమలు ఉత్పత్తులు తగ్గించుకోవడంతో సరకు రవాణా బాగా తగ్గిపోయింది. ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చి, కొత్త సంవత్సరం ప్రారంభపు నెల ఏప్రిల్‌లో రైల్వేకు సరకు రవాణా ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది.

అయితే ఈ ఏడాది వైరస్ కారణంగా ఈ రెండు నెలల్లోను సరకు రవాణా నిలిచిపోయింది. ఈ డివిజన్‌ వార్షిక ఆదాయం సుమారుగా రూ.16 వేల కోట్లు. నాలుగు నెలలు రవాణా స్తంభించి పోవడంతో రూ.6 వేల కోట్ల వరకు నష్టం వచ్చిందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వేలో కొత్త ప్రాజెక్టులు ఏవీ చేపట్టవద్దని ఆదేశించారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఇచ్చే పరిస్థితి లేదని, వాటి కోసం చూడవద్దని చెప్పేశారు. ప్పటికే నిర్మాణంలో ఉన్నవి, భద్రతాపరంగా అవసరమైనవి, మౌళిక వసతులకు సంబంధించిన పనులు మాత్రమే చేపట్టాలని సూచించారు. దాంతో దక్షిణ కోస్తా జోన్‌ పనులు పూర్తిగా ఆగిపోయాయి.

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఇవ్వాలని ఓఎస్‌డీగా ధనుంజయులును కేంద్రం నియమించింది. ఆయన జోన్‌ మొత్తం తిరిగి అభిప్రాయాలు సేకరించి, పూర్తి వివరాలతో డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు సమర్పించారు. దానిని బోర్డు ఇంకా పరిశీలించనేలేదు. ఈలోగా ఓఎస్‌డీ ధనుంజయులకు పదోన్నతి కల్పించి చెన్నైకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇప్పట్లో కొత్త జోన్‌కు సంబంధించిన ఏ పనులు జరగవని, వచ్చే ఏడాది బడ్జెట్‌లో ఉండవచ్చునని చెబుతున్నారు