Begin typing your search above and press return to search.

2024లో అజయ్ మిశ్రా పై.. ఆ రైతు బిడ్డ పోటీ

By:  Tupaki Desk   |   7 Feb 2022 2:30 AM GMT
2024లో అజయ్ మిశ్రా పై.. ఆ రైతు బిడ్డ పోటీ
X
గతేడాది ఉత్తరప్రదేశ్ లో జరిగిన లఖీంపూరి ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలన రేపిందో అందరికీ తెలిసిందే. మూడు సాగు చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు తన ఎస్యూవీని పోనిచ్చాడు. ఈ ఘటనలో పలువురు రైతులు మరణించారు. అనంతరం హింస కూడా చెలరేగింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వచ్చినా.. ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా పాల్గొన్నాడనేది స్పష్టమైపోయింది.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్నీ ఈ ఘటన ఇరుకున పెట్టింది. చివరకు అటు తిరిగి ఇటు తిరిగి కేంద్రం మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఇదంతా ఒక ఎత్తయితే.. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో కూడా సాగు చట్టాలను కేంద్రం వెనక్కుతీసుకుందని భావిస్తున్నారు. పైగా లఖీంపూర్ ఖేరీ యూపీలోనే ఉంది. సహజంగానే దీని ప్రభావం ఆ రాష్ట్ర ఎన్నికలపై ఉంటుంది. అతిపెద్ద ఓట్ల వర్గమైన రైతులను ఆకర్షించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. ఇదే విధంగా లఖీంపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన ఓ రైతు కుమారుడిని రాజకీయ పార్టీలు

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో దింపే యోచన చేశాయి. కానీ, ఆ రైతు బిడ్డ పెద్ద లక్ష్యమే పెట్టుకున్నాడు. అసెంబ్లీకి కాదు.. లఖీంపూర్ ఖేరీ ఘటనలో పాల్గొన్న ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు.

సమాజ్ వాదీ, కాంగ్రెస్ కోరినా..

గతేడాది అక్టోబర్ 3న లఖింపుర్లో నిరసన తెలియజేస్తున్న రైతులపైకి మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసలో ఓ జర్నలిస్ట్ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆశిష్‌ మిశ్రా సహా పలువురిని సిట్ అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కాగా, లఖీంపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన రైతుల్లో నచతార్ సింగ్ ఒకరు. ఆయన కుమారుడు జగ్దీప్ సింగ్. లఖీంపూర్ ఘటనను రాజకీయంగా వాడుకుని బీజేపీని ఇరుకున పెట్టాలని భావించిన సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు జగ్దీప్ ను అసెంబ్లీ

ఎన్నికల్లో పోటీకి దింపాలని భావించాయి. జగ్దీప్ ను బీజేపీ రైతుల పట్ల అవలంబించిన వ్యతిరేక విధానాలు, మూడు సాగు చట్టాల ఉద్యమానికి ప్రతిరూపంగా చూపడం ద్వారా యూపీలో రైతుల ఓట్లను రాబట్టాలని ప్రయత్నించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జగ్దీప్ ను కోరాయి. కానీ, ఈ ఆఫర్ ను జగ్దీప్ తిరస్కరించాడు. 2024లో యూపీలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై పోటీ చేస్తానని ప్రకటించాడు. ఈ ఉద్దేశంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు జగదీప్ సింగ్ తెలిపాడు.

దౌరహరా నుంచి బరిలో దిగమన్నా..

‘లఖింపుర్ ఖేరిలోని దౌరాహరా స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా ఎస్పీ, కాంగ్రెస్ నన్ను సంప్రదించాయి. కానీ నేను ఈ చిన్న యుద్ధాల్లో పాల్గొనని చెప్పా. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వమని అడిగా. నేను అజయ్ మిశ్రాపై ప్రత్యక్షంగా పోటీ చేస్తా. నేను పోరాడాలి. సరైన పద్ధతిలో పోరాడతా’అని జగ్దీప్ సింగ్ అంటున్నాడు. తన కుటుంబంలో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదన్నాడు జగ్దీప్. తాను ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని, రైతు నాయకుడు తేజేందర్ సింగ్కు ప్రస్తుతం తాము మద్దతుగా ఉన్నామని తెలిపాడు.

బ్రాహ్మణుల కోసమే బీజేపీ నాటకాలు

యూపీలో బ్రాహ్మణులు కీలకం అన్నది అందరికీ తెలిసిందే. అసలే ఈ వర్గం సీఎం యోగి తీరుపై గుర్రుగా ఉంది. వారిని మచ్చిక చేసుకోవడానికి బీజేపీ నానా తిప్పలు పడుతోంది. దీన్ని కూడా జగ్దీప్ ప్రస్తావించాడు.బ్రాహ్మణుల ఓటు బ్యాంకు కోసమే అజయ్ మిశ్రాను కేంద్రం పదవి నుంచి తొలగించలేదన్నాడు. మిశ్రా పదవిలో ఉన్నంతకాలం తమకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశాడు.