Begin typing your search above and press return to search.

సంకీర్ణంలో స‌మ‌న్యాయం.. ఏం మాట్లాడుతున్నారు

By:  Tupaki Desk   |   21 Oct 2017 4:45 AM GMT
సంకీర్ణంలో స‌మ‌న్యాయం.. ఏం మాట్లాడుతున్నారు
X
త‌న రాజ‌కీయ జీవితాన్నంతా ఒకే ఒక్క సింగిల్ పార్టీ... అది కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగించిన భార‌త మాజీ రాష్ట్రప‌తి... దేశ ప్ర‌థ‌మ పౌరుడి బాధ్య‌త‌ల నుంచి కూడా ఇటీవ‌లే దిగిపోయారు. క్రియాశీల రాజ‌కీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న నిజంగానే పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రించారు. పార్టీకి సంబంధించి దేశంలో ఏ మూల ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా.. దానిని సునాయ‌సంగా ప‌రిష్క‌రించాలంటే పార్టీ అధిష్ఠానం ప్ర‌ణ‌బ్ నే రంగంలోకి దించుతోంది. ఒక్క దేశీయ స‌మ‌స్య‌లే ఏమిటీ?... భార‌త్‌ కు ఇత‌ర దేశాల‌తో స‌త్సంబంధాల విష‌యంలోనూ స‌మ‌స్య‌లు వ‌స్తే... ప్ర‌ణ‌బే వాటిని సునాయ‌సంగా చ‌క్కదిద్దిన వైనం మ‌నం చాలానే చూశాం. యూపీఏ హ‌యాంలో మ‌న్మోహ‌న్ సింగ్ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌నిచేసిన ప్ర‌ణ‌బ్.. పార్టీ విప‌క్షంలో ఉన్నా అధికార ప‌క్షానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించ‌డంలో దిట్ట‌గానే పేరుగాంచారు.

ఇదంతా గ‌తం అనుకుంటే... యూపీఏ హ‌యాంలో రాష్ట్రప‌తి ప‌ద‌విని అధిష్టించిన ప్ర‌ణ‌బ్ క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరం కావాల్సి వ‌చ్చింది. రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌హించిన త‌ర్వాత మ‌రోమారు క్రియాశీల రాజ‌కీయాల్లోకి రావ‌డం కుద‌ర‌దు. మ‌రి ప్ర‌ణ‌బ్ ఇప్పుడేం చేయాలి? వయ‌సు మీద ప‌డ్డా త‌న‌లో ఏమాత్రం ప‌స త‌గ్గ‌లేద‌ని ఆయ‌న ఇటీవ‌ల చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు - ఆయ‌న చేతి నుంచి జాలువారిన పుస్త‌కాలు - ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ఇస్తున్న ఇంట‌ర్వ్చూలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. అయినా ఇప్పుడు ప్ర‌ణ‌బ్ విష‌యాన్ని ఎందుకు ప్ర‌స్తావించాల్సి వ‌చ్చిందంటే... సంకీర్ణ ప్ర‌భుత్వాలు పాలన సాగిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో అటు జాతీయ ప్ర‌యోజ‌నాల‌తో పాటు ఇటు ప్రాంతీయ ప్ర‌యోజ‌నాల‌కు ఏమాత్రం న్యాయం జ‌రుగుతుంద‌న్న అంశంపై ప్ర‌ణ‌బ్ దా త‌న‌దైన స్టైల్లో ఓ క్లిస్ట‌ర్ క్లియ‌ర్ ప్ర‌క‌ట‌న చేశారు.

సింగిల్ పార్టీలు ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశాలు రాను రాను త‌గ్గిపోతున్నాయి. కేంద్రంలో సింగిల్ పార్టీ ప్ర‌భుత్వాన్ని చూసి దాదాపుగా మూడు ద‌శాబ్దాల‌కు పైగానే అయ్యింది. అదేంటీ... ఇప్పుడు న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సింగిల్ పార్టీ ప్ర‌భుత్వ‌మే క‌దా అంటే... ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన‌న్ని సీట్లు బీజేపీ సాధించినా... ఎన్నిక‌ల‌కు ముందు నాటి ఒప్పందాల మేర‌కు న‌రేంద్ర మోదీ సంకీర్ణ స‌ర్కారునే ఏర్పాటు చేశారు. అంటే... మూడు ద‌శాబ్దాల‌కు పైగా దేశంలో సంకీర్ణ స‌ర్కారులే పాల‌న సాగిస్తున్నాయ‌న్న మాట‌. మ‌రి ఈ సంకీర్ణ ప్ర‌భుత్వాల పాల‌న‌లో జాతీయ‌ - ఆయా రాష్ట్రాల ప్ర‌యోజ‌నాలకు ఏ మేర‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న విష‌యానికి వస్తే... సంకీర్ణ పాల‌న‌లో ఈ రెండింటికీ స‌మ‌న్యాయం చేయ‌డం దుస్సాధ్య‌మేన‌ని ప్ర‌ణ‌బ్ దా తేల్చేశారు.

కాంగ్రెస్ పార్టీ హ‌యాంలోని యూపీఏ కేబినెట్‌ లో కీల‌క మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌ణ‌బ్‌... ఆ అనుభవంతోనే ఈ మాట చెప్ప‌గలిగార‌ట‌. మ‌రి అటు జాతీయ ప్ర‌యోజ‌నాల‌తో పాటు ఇటు ఆయా రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల‌కు స‌మ‌న్యాయం జ‌ర‌గాలంటే సంకీర్ణ ప్ర‌భుత్వాల పాల‌న అంత‌రించాల్సిందేనా అంటే... అది కూడా స్వాగ‌తించ‌ద‌గ్గ అంశం కాద‌ని కూడా ప్ర‌ణ‌బ్ దా చెప్పారు. సంకీర్ణ పాల‌న‌లో ఇత‌ర పార్టీల నిర్ణ‌యాల మేర‌కు ప్ర‌ధాన భాగ‌స్వామ్య ప‌క్షం నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంద‌ని, ఇలా ఒకే నిర్ణ‌యంపై ప‌లు విడ‌త‌లుగా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం మేలేన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. అంటే సంకీర్ణ పాల‌న‌లో ఎన్ని ప్ర‌యోజ‌నాలున్నాయో, అన్ని క‌ష్టాలు కూడా ఉన్నాయ‌న్న మాట‌.