Begin typing your search above and press return to search.

ఏజ్ ఫ్యాక్టర్ : బాబు వయసు 27.. మరి టీడీపీ వయసు...?

By:  Tupaki Desk   |   23 May 2022 9:30 AM GMT
ఏజ్ ఫ్యాక్టర్ : బాబు వయసు 27.. మరి టీడీపీ వయసు...?
X
తెలుగుదేశం పార్టీ మహానాడుకు రంగం సిద్ధం అవుతోంది. మరి కొద్ది రోజులలో ఆ సంబరాలు అంబరాన్ని దాటనున్నాయి. అసలే గేర్ మార్చి ఉత్సాహం మీద పార్టీ ఉంది. దాంతో తమ్ముళ్లకు ఇది పండుగగానే చూడాలి. ఇదిలా ఉంటే టీడీపీ అసలు వయసు ఎంత అంటే రాజకీయాల మీద కనీస అవగాహన ఉన్న వారు ఎవరైనా ఇట్టే చెప్పేసారు. అవును టీడీపీ ఏజ్ ఈ రోజుకు నలభయ్యేళ్ళు. మరి పార్టీ పుట్టిన నాటికి పాతికేళ్ళ వయసు ఉన్న వారు ఇపుడు చూస్తే షష్టి పూర్తిని దాటి ఉంటారు. అది చాలా సులువుగా తేలిపోయే లెక్క.

ఈ రోజుకు కూడా చూస్తే మీడియా కనిపించే వారిలో అంతా సీనియర్ సినిజన్ వారే. ఆ నాయకులే ఈ రోజుకీ పాలిటిక్స్ ని నడుపుతున్నారు. కానీ రాజకీయ అలా ఉందా. ఏపీలో చూస్తే జగన్ వచ్చాక రాజకీయ పూర్తిగా మారిపోయింది. దూకుడు ఎక్కువ అయింది. ఒక మాట అని రెండు తినడం కాదు, పది మాటలకు ఇరవై రివర్స్ లో జవాబు చెప్పడం ఇపుడు పాలిటిక్స్. అంతే కాదు రఫ్ అండ్ టఫ్ పాలిటిక్స్ చేస్తున్న తీరు కూడా వర్తమాన రాజకీయాల్లో కనిపిస్తోంది.

మరి దానికి కనెక్ట్ అయ్యేలా టీడీపీలో పాతతరం ఉన్నారా అన్నది ప్రశ్న. ఇక ఈ మధ్య సీమ జిల్లాల టూర్లు చేసినపుడు చంద్రబాబు ఒక మాట పదే పదే అంటూ వచ్చారు. ఆయన నా వయసు 72 కాదు, 27 మాత్రమే సుమా అని తమ్ముళ్ళను కిర్రెక్కించారు. అంటే ఆరోగ్యపరంగా చూస్తే బాబు ఈ ఏజ్ లో పూర్తిగా బాగా ఉన్నారు అనే చెప్పాలి. అయితే శారీరక ఆరోగ్యం వేరు. ఈ నాటి జనరేషన్ తో కనెక్ట్ అయ్యే విషయం వేరు.

ప్రతీ అయిదేళ్ళకు జరిగే ఎన్నికల్లో కొత్త జనరేషన్ పుట్టుకువస్తుంది. వారు నవ ఓటర్లుగా ఉంటారు. వారు ఒక విధంగా గెలుపోటములను ఎంతో కొంత ప్రభావితం చేస్తూ ఉంటారు. మరి నవతరం ఓటర్లను, న్యూ జనరేషన్లతో అనుసంధానం చేసే దిశగా టీడీపీ యాక్షన్ ప్లాన్ ఉందా అన్నదే ఇక్కడ చర్చ. అసలు చంద్రబాబు తీరు చూస్తే ఆయన 70 కాలం నాటి ట్రెడిషనల్ పొలిటీషియన్.

ఆయన వ్యూహాలు కూడా రొటీన్ గా ఉంటూ వస్తున్నాయి అన్న విమర్శ‌లు ఉన్నాయి. ఇక ఆయన సభలలో గంటల తరబడి స్పీచులు ఇస్తూంటారు. ఈనాటి జనరేషన్ అలాంటి పొడవైన స్పీచులను నిజంగా వింటున్నారా అన్న అధ్యయం టీడీపీ ఎపుడైనా చేసిందా అన్నదే పాయింట్. అంతే కాదు, చెప్పిన విషయాలనే పదే పదే చెబుతూ బోర్ కొట్టించే వైఖరి కూడా బాబు స్పీచులలో కనిపిస్తుంది.

అయితే ఇది సోషల్ మీడియా యుగం. ఎవరు ఏమిటి అన్నది జనాలకు స్మార్ట్ ఫోన్ ఇట్టే చెప్పేస్తుంది. ఏపీలో ఏం జరుగుతుంది అన్నది సగటు జనాల కంటే ఏ నాయకుడికీ తెలియదు అని కూడా చెప్పాలి. అందువల్ల స్పీచులను మార్చుకోవాలి. జనాలకు కనెక్ట్ కావాలీ అంటే అవతల పక్షాన్ని దారుణంగా తిట్టడం ఒక్కటే కాదు, పాజిటివ్ వేలో వారిని ఆకట్టుకోవాలి.

తాము ఏం చేస్తామన్నది చెప్పాలి. ఏపీ ఎక్కడ దెబ్బ తిన్నది, దానికి ఏ రకమైన కారణాలు ఉన్నాయి అన్నవి సహేతుకమైన విశ్లేషణలతో బాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు జనాల ముందు ఉంచాలి. ఏపీలో దారుణమైన ఆర్ధిక పరిస్థితులకు కేంద్రం పాత్ర కూడా ఉంది. దాన్ని విస్మరించి రాష్ట్ర ప్రభుత్వాన్నే విమర్శిస్తే జనాలకు విషయాలు తెలియవా అన్నదే ప్రశ్న.

ఇక టీడీపీని టాప్ టూ బాటం అంతా మార్చుకోవాలి. ఈ రోజుకు కూడా నలభై శాతం యువతకు మాత్రమే టికెట్లు ఇస్తామని చంద్రబాబు అంటున్నారు. దాన్ని ఎందుకు ఎనభై శాతం అయినా చేయకూడదు అన్నది పార్టీ నుంచే వస్తున్న ప్రశ్న. పార్టీ వయసు నలభై అయినపుడు యువతతో పార్టీని నింపాలసిన బాధ్యత కూడా అధినాయకత్వం మీద ఉంది కదా.

పైలా పచ్చీస్ నేతలను రెడీ చేయాలి కదా. అపుడే కదా వారు జనాలతో కనెక్ట్ అవుతారు. అపుడే కదా పార్టీ ప్రజలతో మమేకం అవుతుంది. మరి నా వయసు పాతిక అని బాబు అనుకుంటే సరిపోదని పార్టీ వయసుని కూడా పాతిక చేయాలని, అలా చేయలాంటే చాలా రిపేర్లు చేయాలని వస్తున్న సూచనలు, మరి బాబు గారు వింటారా. చూడాలి.