Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో చాలా బాధ‌ప‌డుతున్నా: జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

By:  Tupaki Desk   |   27 Aug 2022 1:30 AM GMT
ఆ విష‌యంలో చాలా బాధ‌ప‌డుతున్నా:  జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ
X
భార‌త స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. జ‌స్టిస్ ఎన్ వీర‌మ‌ణ‌.. త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ సంద‌ర్భంగా కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆ విష‌యంలో తాను చాలా బాధ‌ప‌డుతున్నానంటూ.. ఒక ముఖ్య‌మైన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

కరోనా కారణంగా తన హయాంలో 50 రోజుల కంటే ఎక్కువ పూర్తిస్థాయి విచారణ జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న‌ట్టు చెప్పారు. కాగా, శుక్ర‌వారం సుప్రీం కోర్టు కార్య‌క‌లాపాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు. దీనిని ప్ర‌స్తావించిన ఆయ‌న అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆకాంక్షించారు.

సాంకేతిక మార్పులను న్యాయవ్యవస్థ అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆ దిశలో తాను శాయశక్తులా కృషి చేశానని గుర్తుచేసుకున్నారు. పెండింగ్‌ కేసులు పెద్ద సవాలుగా నిలిచాయన్న ఆయన.. కేసుల లిస్టింగ్‌, విచారణ తేదీల ఖరారుపైఎక్కువ దృష్టి కేంద్రీకరించలేకపోయినట్లు విచారం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తన హయాంలో 50 రోజుల కంటే ఎక్కువ పూర్తిస్థాయి విచారణ జరగకపోవడం పట్ల కూడా జస్టిస్‌ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌ కేసుల సమస్య పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సుప్రీంకోర్టు విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న జస్టిస్‌ రమణ లేనిపక్షంలో ప్రజల నుంచి గౌరవాన్ని ఆశించలేమని స్పష్టం చేశారు. `` సుప్రీంకోర్టు అభివృద్ధిలో నేనొక్కడిని మాత్రమే కాదు.. ఎంతోమంది గొప్పవారు త్వరగా న్యాయం అందించేందుకు తమ వంతుగా ఎంతో కృషిచేశారు.

ప్రధాన న్యాయమూర్తిగా నా పదవీకాలమైన గత 16 నెలల్లో 50 రోజులు మాత్రమే పూర్తిస్థాయి విచారణలు జరగడం బాధాకరం. ప్రధాన న్యాయమూర్తులు వస్తారు, వెళతారు. కానీ సుప్రీంకోర్టు శాశ్వతం. ప్రతిఒక్కరూ ఈ వ్యవస్థకు ఎంతో కొంత తమ భాగస్వామ్యాన్ని అందిస్తారు. ఈ విషయంలో నా శాయశక్తులా కృషిచేశాను.`` అని ర‌మ‌ణ అన్నారు.

సామాన్యుల‌కు భారం లేని న్యాయం!

న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఏకైక మార్గం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగించడమేన‌ని జ‌స్టిస్ ఎన్ వీ ర‌మ‌ణ అన్నారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి అన్నింటికీ పరిష్కారం చూపాలన్నారు. ఈ దిశలో కొన్ని మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేసినప్పటికీ భద్రతాపరమైన అంశాల దృష్ట్యా మరింత పురోగతి సాధించలేక పోయామ‌ని తెలిపారు. కేసుల్లో సంవాదాలు, చర్చలను మరింత త్వరగా పూర్తిచేసి సామాన్యులకు త్వరితగతిన ఆర్థికంగా భారం కాకుండా న్యాయం అందించేందుకు మనమంతా ప్రయత్నించాలని ఆయ‌న న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదుల‌కు పిలుపునిచ్చారు.