Begin typing your search above and press return to search.

దేశమంతా 'అగ్నిపథ్' మంటలు.. సికింద్రాబాద్ లో కాల్పులు

By:  Tupaki Desk   |   17 Jun 2022 6:30 AM GMT
దేశమంతా అగ్నిపథ్ మంటలు.. సికింద్రాబాద్ లో కాల్పులు
X
అగ్నిపథ్ మంటలు దేశమంతటా విస్తరిస్తున్నాయి. ఇన్నాళ్లు ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఈ మంటలు ఇప్పుడు దక్షిణ భారతానికి అంటుకున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుద్యోగులు రైళ్లకు నిప్పు పెట్టడంతో ఇది మరింతగా రాజుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బీహార్ లో ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ లలో ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. పలు ప్రాంతాల్లో రాళ్లదాడులు కొనసాగుతున్నాయి.

ఇప్పుడు ఆ మంటలు తెలంగాణకు పాకాయి. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొంతమంది యువకులు ఆందోళనకు దిగారు. రైలు పట్టాలపై పార్సిల్ సమాన్లు వేసి నిరసన తెలిపారు. అగ్నిపథ్ ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిప్పు పెట్టారు.

ఇక సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోలనకారులను అదుపులోకి తీసుకున్నారు.

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం అగ్నిపథ్ స్కీమ్ పేరుతో కేంద్రం కొత్త సర్వీసును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు అర్హత వయసు 17.5 నుంచి 21 ఏళ్లుగా నిర్ణయించింది. కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి సైనిక నియామకాలు చేపట్టకపోవడంతో కేంద్రప్రభుత్వం ఈ ఏడాది కొంత సడలింపు ఇచ్చింది. 2022 నియామకాలకు 23 ఏళ్లకు అర్హతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.నాలుగేళ్ల పరిమితితో మొదటి సారి కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకం కింద తొలి బ్యాచ్ 45 వేల మందిని నియమించుకున్నారు.

-బల్లియాలో రైలుకు నిప్పు తాజాగా ఈరోజు యూపీలోని బల్లియా రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు పెద్దఎత్తున గుమిగూడి రైలుకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. ఆందోళనకు దిగుతున్న విద్యార్థులు స్టేషన్ లోని కిటీకీ అద్దాలను పగులకొట్టి ఖాళీగా ఉన్న రైలుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకు నిరసనగా లఖిసరాయ్ జంక్షన్ వద్ద ఆందోళనకారులు రైలును తగులబెట్టారు.

-మంటల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ఆందోళనకారులపై కాల్పులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు రైళ్లకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మంటల్లో చిక్కుకుంది. రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పలువురికి గాయాలైనట్టు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.