Begin typing your search above and press return to search.

ఆగిన మెట్రో.. ఎక్క‌డిజ‌నాలు అక్క‌డే.. కాల్పుల‌కు పోలీసులు రెడీ!

By:  Tupaki Desk   |   17 Jun 2022 8:53 AM GMT
ఆగిన మెట్రో.. ఎక్క‌డిజ‌నాలు అక్క‌డే.. కాల్పుల‌కు పోలీసులు రెడీ!
X
కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన `అగ్నిప‌థ్‌` సైనిక నియామ‌కాల ప‌థ‌కం.. తెలంగాణ‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల కు ప్రారంభ‌మైన నిర‌స‌న మ‌రింత మ‌హోగ్ర‌రూపం దాల్చుతోందే త‌ప్ప‌.. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. నిముష నిముషానికి అనేక సంచ‌ల‌నాలు చోటు చేసుకుంటున్నాయి. అగ్నిపథ్‌ను నిరసిస్తూ యువకులు ఆందోళనతో సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లలో హైఅలెర్ట్‌ ప్రకటించారు.

ప్రధానమైన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్‌, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసి వేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.

అయిన‌ప్ప‌టికీ.. నిరుద్యోగులు మాత్రం రైల్వే స్టేష‌న్ల‌ను ఖాళీ చేయ‌డంలేదు. ఎక్క‌డిక‌క్క‌డ రైలు ప‌ట్టాల‌పైనా.. రైళ్ల‌పైనా ప‌డుకుని నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఇప్ప‌టికే ఒక సారి కాల్పులు జ‌రిపిన పోలీసులు.. మ‌రోసారి కాల్పులు జ‌రుపుతామ‌ని.. హెచ్చ‌రించారు.

పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ఒక‌రు మృతి చెంద‌గా.. ప‌దుల సంఖ్య‌లో తొక్కిస‌లాట‌లో విద్యార్థులు గాయ‌ప డ్డారు. మ‌రోవైపు సికింద్రాబాద్‌లో చోటు చేసుకున్న ఆందోళనల దృష్ట్యా హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు రద్దు చేశారు. అన్ని మార్గాల్లో రైళ్ల‌ను రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ప్ర‌క‌టించారు.

ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే 12ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు చేశారు. త‌ర్వాత‌.. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే 13 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేశారు. ఆందోళనల దృష్ట్యా శుక్ర‌వారం రాకపోకలు నిలిపివేసిన‌ట్టు వివ‌రించారు.

ఏపీలోనూ ఎఫెక్ట్‌

దీంతో రైలు ప్ర‌యాణికులు.. ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌క ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని నిరీక్షిస్తున్నారు. మ‌రోవైపు ఏపీలోనూ.. రైల్వే స్టేష‌న్ల‌లో హై అలెర్ట్ ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌, గుంటూరు, బాప‌ట్ల‌.. వంటి కీల‌క‌మైన రైల్వే స్టేష‌న్ల‌లో సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని గంట‌ల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.