Begin typing your search above and press return to search.

అప్పుడు రైతులు.. ఇప్పుడు నిరుద్యోగులు.. మోడీ మార్క్‌కు ఎదురు దెబ్బ‌!

By:  Tupaki Desk   |   18 Jun 2022 2:30 AM GMT
అప్పుడు రైతులు.. ఇప్పుడు నిరుద్యోగులు.. మోడీ మార్క్‌కు ఎదురు దెబ్బ‌!
X
త‌న‌ను మించిన మేధావి లేడ‌ని, ప్ర‌పంచ దేశాలు కూడా త‌న‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాయ‌ని .. ప‌దే ప‌దే చెప్పుకొనే ప్ర‌ధాని మోడీ.. మలి విడ‌త పాల‌న‌లో తీసుకున్న రెండు నిర్ణ‌యాలు.. ఆగ్ర‌హ జ్వాల‌ల‌ను రేపాయి. దేశానికి అగ్గి పుట్టించాయి. గ‌త 2021లో తీసుకున్న మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు.. ఇప్పుడు తాజాగా తీసుకువ‌స్తామ‌ని చెప్పిన అగ్నిప‌థ్ ప‌థ‌కంకూడా.. మోడీకి సెగ‌లు రేపింది. అప్ప‌ట్లో కార్పొరేట్ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించాల‌నే ల‌క్ష్యంతో.. మోడీ.. ఈ మూడు సాగు చ‌ట్టాల‌ను తెర‌మీదికి తెచ్చార‌నే వాద‌న వినిపించింది.

దీంతో ఉత్త‌రాది రైతులు ఉద్య‌మం ప్రారంభించారు. అయితే.. ఈ ఉద్య‌మం.. ఆచి తూచి అడుగులు వేసిం ది. ముందు ప్ర‌తిపాద‌న‌లు.. త‌ర్వాత‌.. నిర‌స‌న‌లు.. ఆ త‌ర్వాతే.. ఉద్య‌మాల వ‌ర‌కు సాగింది. ఇవి కూడా మ‌హోగ్ర రూపం దాల్చాయి. రైతులపై ఉక్కుపాదం మోపినా.. వారు వెన‌క్కి త‌గ్గ‌లేదు. దాదాపు ఏడాదికి పైగా సాగిన రైతుల ధ‌ర్నాలు.. దీక్ష‌లు.. నిర‌స‌న‌లు.. మొత్తానికి కేంద్రం వెన‌క్కి త‌గ్గి.. స‌ద‌రు మూడు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునేలా చేసింది.

అయితే.. అప్ప‌ట్లో ఈ మూడు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డాన్ని.. మోడీ వెన‌క్కి త‌గ్గిన‌ట్టుగానే ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారం చేశాయి. ఇది ఇంకా మ‌రిచిపోక ముందే.. ఇప్పుడు దేశ ఆర్మీ నియామ‌కాల‌కు సంబంధించి మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం.. దేశంలో అగ్గిని రాజేసింది.

యువ‌త ఎప్ప‌టి నుంచో ఆర్మీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో.. వారిని అగ్నిప‌థ్ పేరిట నియామ‌కాలు చేసుకుంటామ‌ని.. త‌ర్వాత‌.. నాలుగే ళ్ల వ‌ర‌కే సేవ‌లు వినియోగించుకుంటామ‌ని.. ప్ర‌భుత్వం చెప్ప‌డం..నిర‌స‌న‌ల‌కు దారితీసింది.

నిజానికి సైనిక ఉద్యోగాల్లో కీల‌క‌మైన జ‌వాన్లు, సుబేదార్లు.. వంటి పోస్టుల‌కు.. 30 ఏళ్ల‌కు మించిన వ‌య‌సు ఉన్న‌వారిని ప‌క్క‌న పెడ‌తారు. అంటే.. దాదాపు రిటైర్మెంట్ కిందే లెక్క‌. కానీ, ఇప్పుడు తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్ ద్వారా.. కేవ‌లం నాలుగు సంవ‌త్స‌రాల‌కు మాత్ర‌మే సేవ‌లు వాడుకుంటాం.. త‌ర్వాత‌.. మీ చావు మీరు చావండి అన్న చందంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే.. నిరుద్యోగుల‌కు ఆగ్ర‌హావేశాలు తెప్పించింది. ఈ నేప‌థ్యంలోనే దే శ‌వ్యాప్తంగా ఉద్య‌మాలు ఊపందుకున్నాయి.

ఈ ప‌రిణామాలు.. అంతిమంగా.. మోడీ విధానాల‌పైనా.. దేశాన్ని కార్పొరేటీక‌రిస్తున్న తీరుపైనా.. విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తున్నాయి. వాస్త‌వానికి మోడీ ఓ వెలుగు వెలిగిపోతున్నారంటూ.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌నను గెలిపించేలా బీజేపీ వ్యూహాత్మ‌కంగా ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో.. అంతామోడీ నామ‌స్మ‌ర‌ణ‌లో మునిగితేలుతున్న స‌మ‌యంలో.. ఇప్పుడు అగ్నిప‌థ్ మంట‌లు మోడీని బాగానే తాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అప్ప‌ట్లో రైతులు.. ఇప్పుడు నిరుద్యోగులు.. మోడీకి చుక్క‌లు చూపిస్తున్నార‌ని .. చెబుతున్నారు.