Begin typing your search above and press return to search.

మంత్రిగారికి భార్యతో తలనొప్పి

By:  Tupaki Desk   |   30 Oct 2015 6:27 AM GMT
మంత్రిగారికి భార్యతో తలనొప్పి
X
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తలనొప్పి మొదలైంది. నిత్యం మీడియాలో ఉంటూ ఏపీ ప్రభుత్వంలో బాగానే నెట్టుకొస్తున్న పుల్లారావుకు ఈ కొత్త సమస్య ఎలాంటి కష్టం తెస్తుందో అన్న చర్చ జరుగుతోంది. ఆర్థిక మోసాలతో కేసులను ఎదుర్కొంటున్న అగ్రిగోల్డు సంస్థ నుంచి మంత్రిగారి భార్య కోట్ల విలువైన భూములను కొనుగోలు చేశారని గతంలోనే ఆరోపణలు రాగా తాజాగా ఈ వ్యవహరాంపై కోర్టులో కేసుపడింది. దీంతో ఇది ఎంత వరకు దారితీస్తుందో అని పుల్లారావు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు భార్యకు అగ్రిగోల్డు యాజమాన్యం 14 ఎకరాల భూమిని విక్రయించిందని అభియోగం మోపుతూ తెలంగణ అగ్రిగోల్డ్ కస్టమర్లు - ఏజెంట్ల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ ను సంఘం అధ్యక్షుడు ఏ రమేష్ బాబు దాఖలు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య పి వెంకాయమ్మకు ఈ భూమిని పది కోట్ల రూపాయలకు అగ్రిగోల్డ్ యాజమాన్యం విక్రయించిందని పిటిషన్ లో ఆరోపించారు. ఈ సొమ్మును రికవరీ చేసి డిపాజిట్ చేయించాలని, ఈ ఉదంతంపై విచారణ చేయించాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ విషయమై విచారించి రెండు వారాల్లో నిర్ణయం తెలియజేస్తామని హైకోర్టు తెలిపింది. కాగా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే - జస్టిస్ ఎస్‌ వి భట్ విచారించారు.

అయితే... పేరుకు ఇది మంత్రి భార్యతో జరిగిన కొనుగోలే అయినా ఇందులో మంత్రి హ్యాండు లేకుండా ఇదంతా జరగదని అంతా అంటున్నారు. అయితే... ఇది కొన్నారా.. కొట్టేశారా అన్న సందేహాలు కూడా పలువురు వ్యక్తంచేస్తున్నారు.