Begin typing your search above and press return to search.

బుధవారం సోనియమ్మకు భారీ షాక్ తప్పదా?

By:  Tupaki Desk   |   2 May 2016 6:07 AM GMT
బుధవారం సోనియమ్మకు భారీ షాక్ తప్పదా?
X
కమలనాథులు గురి చూసి కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ అధినేత్రి ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. యూపీఏ హయాంలో ఆగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల తయారీ సంస్థ నుంచి ముడుపులు పొందినట్లుగా ఆరోపణలు రావటం.. ఈ ఉదంతం ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పీకకు చుట్టుకోవటం ఆసక్తికర మలుపు తిరిగినట్లైంది. సోనియమ్మ ఎంత సంకటస్థితిలో ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసేటట్లుగా పార్లమెంటులో కాంగ్రెస్ నేతల వీరంగం చూస్తే.. పరిస్థతి ఎంత ఇబ్బందికరంగా ఉందన్న విషయం ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.

ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారం మరింత నాటకీయ పరిణామాలకు దారి తీసేలా ఉందన్న వాదన తాజాగా కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కుంభకోణంలో కీలకమైన అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ పేరును నిషిద్ధ జాబితాలో చేర్చినట్లుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న వాదనను తిప్పికొడుతున్న పారికర్.. దానికి సంబంధించిన ఉత్తర్వును చూపించాలంటూ సవాలు చేస్తున్నారు.

అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ మీద కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయన మరికొన్ని విషయాల్ని వెల్లడించారు. హెలికాఫ్టర్ల కుంభకోణానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏయే పరిణామాలు చోటు చేసుకున్నాయన్న వివారల్ని ఈ నెల 4న (బుధవారం) పార్లమెంటులో తాను సవివర ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.

వివాదాస్పద ఒప్పంద పరిణామానికి సంబంధించిన అన్ని వివరాల క్రమాన్ని.. పూర్తి వాస్తవాల్ని పార్లమెంటుకు చెబుతానని.. అగస్టా సంస్థ కోసం ఎప్పుడెప్పుడు ఏయే నిబంధనల్ని ఎలా సడలించారన్న విషయాన్ని సైతం తాను చెప్పనున్నట్లు ప్రకటించారు. పారికర్ తాజా వ్యాఖ్యలు చూస్తే.. బుధవారం అగస్టా కుంభకోణానికి సంబంధించి రక్షణ మంత్రి వెల్లడించే వివరాలు కాంగ్రెస్ అధినేత్రికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పారికర్ మాటల్లో ఉన్నంత ‘విషయం’ పార్లమెంటులో ప్రకటించే ప్రకటనలో ఉండనుందా? అన్నది కూడా పెద్ద ప్రశ్నే.