Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ ఎఫెక్ట్: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   23 Dec 2021 1:30 PM GMT
ఒమిక్రాన్ ఎఫెక్ట్: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
X
దేశంలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోవడంతో కేంద్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కొత్త వేరియంట్ దూసుకొస్తున్న వేళ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.

దేశంలో కరోనా పరిస్థితులు.. ఒమిక్రాన్ పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని తెలిపారు.

ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలన్నారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండుగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

-రాష్ట్రాలకు కేంద్రం చేసిన పలు సూచనలివీ..
పండుగల వేళ రాష్ట్రాలన్నీ రాత్రి కర్ఫ్యూలను అమలు చేయాలని కేంద్రం సూచించింది. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని చెప్పింది. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా పరిగణించి అక్కడ తగిన నిబంధనలు అమలు చేయాలని కోరింది. అన్ని జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్ కేసుల సంఖ్యను పరిశీలించాలని తెలిపింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యం, అంబులెన్స్, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించింది. రాష్ట్రంలో వైరస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని.. మాస్క్ లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించింది. వ్యాక్సినేషన్ వేగవంతం చేసి జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ ముమ్మరం చేయాలని సూచించింది.