Begin typing your search above and press return to search.

హిందూపురం అధికార పార్టీలో కుమ్ములాటలు..తారస్థాయికి విబేధాలు

By:  Tupaki Desk   |   2 March 2020 7:30 PM GMT
హిందూపురం అధికార పార్టీలో కుమ్ములాటలు..తారస్థాయికి విబేధాలు
X
అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ లో నాయకుల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉంది. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విబేధాలు పార్టీ నాయకుల మధ్య ఏర్పడ్డాయి. పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. దీనికి కారణం పార్టీ, వైఎస్ జగన్ వైఖరి అని తెలుస్తోంది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ పరిస్థితి అనంతపురము జిల్లాలో ఉంది.

వైఎస్‌ఆర్‌కు విధేయులుగా ఉన్న కొందరు నాయకులు ఇప్పుడు తెర మరుగయ్యారు. ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు బహిరంగంగానే విమర్శలు చేసుకునే స్థాయికి చేరాయి. దీనికి చక్కటి ఉదాహరణ. హిందూపురంలో జరిగిన పరిణామాలే. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్‌ నిశ్చల్‌ మధ్య తీవ్ర విబేధాలు వచ్చాయి. వ్యక్తిగత దూషణలకు దిగే పరిస్థితికి చేరాయి. వీరిద్దరి వర్గాలు వేర్వేరుగా సమావేశమై ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నారు. మహమ్మద్‌ ఇక్బాల్‌ పార్టీకి పట్టిన కరోనా వైరస్‌ అని నవీన్‌ నిశ్చల్‌ విమర్శించారు. ఆయనకు మద్దతుగా మరికొందరు నాయకులు విమర్శలు చేశారు. దీంతో ఎమ్మెల్సీ వర్గీయులు మండిపడ్డారు.

వైసీపీ ద్రోహి నవీన్‌నిశ్చల్‌ అంటూ ఎమ్మెల్సీతో పాటు ఆయన వర్గీయులు ఘాటుగా విమర్శలు చేశారు. దీంతో పార్టీ శ్రేణులు రెండుగా చీలాయి. రెండు వర్గాలు తమ సామాజిక వర్గాలను పోగేసుకుంటూ తమ బలం చూపించుకునేందుకు సిద్ధపడ్డాయి. దీంతో పార్టీలో పరిస్థితులు మారాయి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టేందుకు వెనకాడటం లేదు. ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి మహమ్మద్‌ ఇక్బాల్‌ పోటీ చేసి ఓడిపోయాడు. అయితే తన ఓటమికి నవీన్‌ నిశ్చల్‌ తో పాటు ఆయన వర్గం కారణమని ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ వర్గం విమర్శలు చేస్తోంది.

దీంతో అప్పటి నుంచి వీరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఇవి పార్టీకి తలనొప్పిగా మారాయి. దాడులు, పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రస్తుతం అధికార పార్టీ అభాసుపాలవుతోంది. పార్టీ పరువు బజారున పడుతోందని స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు. అయితే త్వరలోనే వీరి రగడపై పార్టీ అధిష్టానం పరిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అధికార పార్టీలో ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కానీ బహిర్గతం కావడం లేదని సమాచారం. జిల్లాలోని ప్రధాన ప్రాంతాలు పెనుకొండ, తాడిపత్రి, ధర్మవరం, అనంతపురము టౌన్, కదిరి తదితర ప్రాంతాల్లో పార్టీలో విబేధాలు ఉన్నాయి. ఈ విబేధాలు ఇలాగే ఉంటే రానున్న స్థానిక ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.