Begin typing your search above and press return to search.

అక్కడ ఆడపిల్ల పుడితే ఫ్రీ

By:  Tupaki Desk   |   20 July 2016 5:03 AM GMT
అక్కడ ఆడపిల్ల పుడితే ఫ్రీ
X
ఆడపిల్ల.. మగ పిల్లాడా అన్నది పట్టించుకోని వారు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నా.. ఆడపిల్లను శాపంగా చూసే వారి సంఖ్య ఇంకా ఉందన్న నిజాన్ని మర్చిపోలేం. పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. ఆబార్షన్ చేయించే వైఖరి ఇప్పటికి దేశంలోని పలు ప్రాంతాల్లో ఉంది. ఈ జాడ్యాన్ని వదిలించేందుకు ప్రభుత్వ పరంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా.. ఇంకా పూర్తి స్థాయిలో దేశ ప్రజలకు అవగాహన రాని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఆడపిల్ల పుడితే అదృష్టలక్ష్మి పుట్టినట్లే అన్న నమ్మికను నిజం చేసేందుకు గుజరాత్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి ఒక ప్రయత్నాన్ని షురూ చేసింది. తమ ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే.. అలాంటి వారి తల్లిదండ్రులు కాన్పు కోసం చెల్లించాల్సిన మొత్తాన్ని పరిహరించనున్నట్లు ప్రకటించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సింధు సేవ సమాజ్ ఆధ్వర్యంలో పని చేస్తున్న సిందు హాస్పిటల్ ఈ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది.

ఆడపిల్లలు ఇంటికి అదృష్ట లక్ష్ములని.. వారిని తప్పుగా చూడకూడదన్న భావనను పెంచేందుకు వీలుగా తాజాగా వారో నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ ఆసుపత్రుల్లో చేరిన గర్భిణులకు ఆడపిల్లలుకానీ పుడితే.. రిజిస్ట్రేషన్ తో సహా.. ఎలాంటి ఖర్చులు వసూలు చేయమని చెబుతున్నారు. ఈ ఆసుపత్రిలో మామూలు డెలివరీకి రూ.7వేలు.. సిజేరియన్ కు రూ.20వేలు వసూలు చేస్తున్నారు. అదే.. ఆడపిల్లలు పుడితే మాత్రం పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఆఫర్ అదిరిపోయింది కదూ.