Begin typing your search above and press return to search.

పొత్తు పొడిచింది...అన్నాడీఎంకే-బీజేపీ సీట్ల పంప‌కం లెక్క ఇదే

By:  Tupaki Desk   |   17 Feb 2019 5:44 AM GMT
పొత్తు పొడిచింది...అన్నాడీఎంకే-బీజేపీ సీట్ల పంప‌కం లెక్క ఇదే
X
గ‌త కొద్దికాలంగా ప్ర‌చారంలో ఉన్న కీల‌క‌మైన చ‌ర్చ‌కు తెర‌ప‌డింది. బీజేపీ, ఏఐఏడీఎంకేల ఎన్నికల పొత్తుపై కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు శుభం కార్డు ప‌డి రాబోయే లోక్‌ సభ ఎన్నిలకు ఈ రెండు పార్టీలు జట్టుగా పోటీచేయనున్నాయి. ఈ మేర‌కు సీట్ల పంప‌కం కూడా పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. తమిళనాడులోని 40సీట్ల(పుదుచ్చేరి సహా)ను 15సీట్లు-25 సీట్ల ఫార్ములా ప్రకారం పంచుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. తాము పంచుకున్న సీట్లనుంచే చిన్న పార్టీలకు సీట్లను కేటాయించేందుకు రెండు పార్టీలు గురువారం రాత్రి జరిగిన ఓ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు కుద‌ర్చ‌డంలో భాగంగా, సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, కేంద్ర మంత్రి పియూశ్‌ గోయల్‌ లు సమావేశమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గ‌త కొద్దికాలంగా పియూశ్ గోయ‌ల్ ఈ ఇద్ద‌రితో చ‌ర్చ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కాగా, పీఎంకేకు నాలుగు సీట్లు, డీఎండీకే పార్టీకి మూడు సీట్లు కేటాయిస్తే బీజేపీకి ఎనిమిది సీట్లు దక్కవచ్చునని స‌మాచారం. కాగా, ఏఐఏడీఎంకే తమ 25 సీట్లను టీఎంసీ(తమిళ్‌ మానిల కాంగ్రెస్‌), ఎన్ ఆర్సీ, పీటీ(పుతియ తమిళగం) పార్టీలతో పంచుకోవాల్సి ఉందని స‌మాచారం. అయితే అన్ని పార్టీల నుంచి రిలోకి దిగేవారి సంఖ్య, సీట్ల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉందని, కానీ, ఒక అవగాహన మాత్రం వచ్చిందని ఏఐఏడీఎంకే వర్గాలు తెలిపాయి.

ఇదిలాఉండ‌గా, ఈ పొత్తుపై ఆదిలోనే అసంతృప్తి తెర‌మీద‌కు వ‌స్తోంది. ఏఐఏడీఎంకేలో అంతర్గతంగా అసమ్మతి గళాలు వినపడుతున్నట్టు సమాచారం. అన్ని పార్టీలతో చర్చించేందుకు ఇద్దరు వ్యాపారవేత్తలను బీజేపీ పార్టీ రంగంలోకి దించడంతో ఈ అసమ్మతి మరింత పెరిగినట్టు తెలుస్తోంది. బీజేపీకి దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక గాలులు వీస్తున్న త‌రుణంలో రాష్ట్రంలో పొత్తతో ప్ర‌యోజ‌నం శూన్య‌మ‌ని కొంద‌రు అన్నాడీఎంకే నేత‌లు పేర్కొంటున్న‌ట్లు స‌మాచారం.