Begin typing your search above and press return to search.

చిన్నమ్మ చేతికి పార్టీ దండం చిక్కేనా?

By:  Tupaki Desk   |   29 Dec 2016 4:31 AM GMT
చిన్నమ్మ చేతికి పార్టీ దండం చిక్కేనా?
X
వెయిట్ చేసిన రోజు రానే వచ్చేసింది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. అంచనాలకు తగ్గట్లే జరుగుతుందా? లేక.. అంతకు మించి ఏదైనా జరగనుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమ్మ మరణించిన నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళతాయన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

పార్టీ పగ్గాల్ని తన చేతిలోకి తీసుకోవాలని ఓపక్క అమ్మ నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.అయితే.. ఆమెకు పోటీగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. అమ్మ మేనకోడలు దీప పేర్లు అన్నాడీఎంకే పార్టీలో వినిపిస్తున్నాయి. వ్యక్తిపూజకు పెద్దపీట వేసే తమిళనాడు రాజకీయాల్లో అమ్మ తర్వాత చిన్నమ్మే అన్నట్లుగా సాగుతున్న ప్రచారానికి తగ్గట్లే పరిణామాలు సాగుతాయా? లేక.. అందుకు భిన్నంగా పరిస్థితులు చోటు చేసుకుంటాయా? అన్నదే సస్పెన్స్ గా మారింది.

పార్టీ కార్యవర్గ సమావేశానికి కార్యవర్గ సభ్యులు 280 మంది.. 50 జిల్లాల కార్యదర్శులు.. మరో 2770 మంది సర్వ సభ్యులు పాల్గొననున్న ఈ సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయా? లేక.. అనుకున్నది అనుకున్న జరుగుతుందా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతుంది.

ఈ సమావేశం ఎలాజరుగుతుందన్న అంశంపై మూడు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

1. చిన్నమ్మకు పార్టీ పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటం .

2. చిన్నమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. చివరకు పన్నీరు సెల్వానికి పగ్గాలు అప్పగించేలా ప్రయత్నం

3. చిన్నమ్మను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకూడదంటూ కోర్టులో పిటీషన్ దాఖలుచేసిన నేపథ్యంలో పన్నీరు సెల్వంను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని.. చిన్నమ్మను ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవటం. కోర్టు చిక్కుల లెక్క తేలిన తర్వాత పార్టీ పగ్గాలు చిన్నమ్మ చేతికి ఇచ్చేలా అంతర్గత ఒప్పందం కుదరటం.

ఇలా.. పలు అంచనాలు వ్యక్తమవుతుంటే.. మరో ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతోంది. ఈ సమావేశానికి అసలు చిన్నమ్మ వస్తారా? రారా? అన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారుతుందని చెబుతున్నారు. తాను లేకున్నా.. తనకు నచ్చినట్లుగా జరిగేలా.. తాను చెప్పినట్లే పరిణామాలు చోటు చేసుకునేలా చిన్నమ్మ స్కెచ్ గీశారా? అన్న సందేహం కూడా వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చిన్నమ్మను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమ్మ మేనకోడలు దీప ఏం చేస్తారు? సమావేశానికి ఆమె ఎంట్రీ ఉంటుందా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏమైనా.. అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమేకాదు.. హాట్ టాపిక్ గా మారిందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/