Begin typing your search above and press return to search.

అమ్మ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ కు వెళ్లిందంటే..?

By:  Tupaki Desk   |   4 April 2016 6:18 PM GMT
అమ్మ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ కు వెళ్లిందంటే..?
X
అమ్మ రాజ‌కీయ‌మే వేరుగా ఉంటుంది. కాలం క‌లిసి రాన‌ప్పుడు కూడా తొణ‌క్కుండా.. బెణ‌క్కుండా.. నిండుకుండ‌లా ఉండటం అమ్మ స్పెషాలిటీ. పీక‌ల్లోతు క‌ష్టాల్లోకి కూరుకుపోయిన‌ప్పుడు కూడా కూల్‌గా ఉంటూ.. మ‌న‌సులోని భావోద్వేగాల్ని ఏ మాత్రం బ‌య‌ట‌ప‌డ‌కుండా చూసుకోవ‌టం ఆమెకు మాత్ర‌మే సాధ్య‌మ‌నాలి. అలాంటి ఆమెకు కాలం క‌లిసి వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. అమ్మ ప్ర‌స్తుత ప‌రిస్థితి ఇప్పుడిలానే ఉంది. కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న ఆన‌వాయితీకి భిన్నంగా ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అమ్మ దుమ్మురేప‌ట‌మే కాదు..మ‌రోసారి అధికార‌దండం అమ్మ‌దేనని స‌ర్వేలు నొక్కి చెబుతున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ మిత్రుల‌తో క‌లిసి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్న ఆమె.. తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తం 234 స్థానాల్లో ఏడు స్థానాలు మిన‌హా మిగిలిన 227 స్థానాల్లో అన్నాడీఎంకే పోలీ చేస్తుంద‌ని తేల్చేశారు. అంటే.. మిత్ర‌ప‌క్షాల అవ‌స‌రం త‌న‌కేమాత్రం అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని అమ్మ త‌న తాజా నిర్ణ‌యంతో చెప్పేశారు. గ‌త ఎన్నిక‌ల్లో మిత్ర‌పక్షాల్ని కంటికి రెప్ప‌లా చూసుకున్న ఆమె.. తాజా ఎన్నిక‌ల్లో వారి అవ‌స‌రం త‌న‌కేం లేద‌న్న విష‌యాన్ని తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న‌తో తేల్చి చెప్పేశారు.గ‌త ఎన్నిక‌ల్లో 160 సీట్ల‌లో మాత్ర‌మే పోటీ చేసిన అన్నాడీఎంకే ఈసారి అందుకు భిన్నంగా 227 స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని చెప్ప‌టం ద్వారా.. త‌న బ‌లం మీద ఆమెకు అంతులేని విశ్వాసం పెరిగిన‌ట్లు చెప్పొచ్చు. మిగిలిన స‌మాయాల్లో ఛాన్స్ తీసుకునే అధినేత‌ల‌కు భిన్నంగా అమ్మ తీసుకున్న తాజా నిర్ణ‌యం త‌మిళ‌నాడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. అమ్మా.. మ‌జాకానా?