Begin typing your search above and press return to search.

షాక్ తిన్న దిన‌క‌ర‌న్‌...మంత్రుల‌పై ఫైర్‌

By:  Tupaki Desk   |   18 April 2017 5:59 PM GMT
షాక్ తిన్న దిన‌క‌ర‌న్‌...మంత్రుల‌పై ఫైర్‌
X
అన్నాడీఎంకే పార్టీలో చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై శ‌శిక‌ళ‌ వ‌ర్గం షాక్ నుంచి తేరుకోలేక‌పోతోంది. పార్టీ నుంచి శ‌శిక‌ళ స‌హా త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ నిప్పులు తొక్కారు. మంత్రులు అని కూడా చూడ‌కుండా పలువురిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే పార్టీ నేత‌లు సైతం అదే రేంజ్‌లో రియాక్ట్ అవ‌డంతో గ‌మ్మున ఉండిపోయార‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో అన్నాడీఎంకే పార్టీలో పన్నీర్ సెల్వం గ్రూప్ విలీనం చ‌ర్చ‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయమై చర్చల వివరాలను దినకరన్ కు 9మంది కమిటీ సభ్యులు వివరించారు. తనకు ఎలాంటి సమాచారమివ్వకుండానే పన్నీర్ సెల్వం గ్రూప్ విలీనం గురించి చర్చలు నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారని స‌మాచారం. అడిగిన వారందరికీ మంత్రి పదవులు ఇచ్చి కోర్కెలు తీరుస్తున్నా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారని స‌మాచారం. దీంతోపాటుగా త‌మ‌ను స‌స్పెండ్ చేసిన ప‌రిణామంపై షాక్ కు లోనైన దిన‌క‌ర‌న్ బెదిరింపుల‌కు పాల్ప‌డినట్లు తెలుస్తోంది ``ఎమ్మెల్యేల్లో మెజార్టీ మా వారే. అలాంటి మ‌మ్మ‌ల్ని తీసేస్తారా? అంత ధైర్యముందా?ఇప్పుడు కొత్తగా మీకు కొమ్ములు మొలిచాయా ? అస‌లు పార్టీ అంటే ఏంటో తెలుసా....ఎలా నడపాలో తెలిసినవారెవరు`` అంటూ దినకరన్ ఆగ్ర‌హించ‌న‌ట్లు సమాచారం. అంతేకాకుండా సెల్వంకు ద‌గ్గ‌ర కావాల‌ని చూస్తే తాను ఏమైనా చేస్తాన‌ని హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే దీనికి మంత్రులు స‌హా నాయ‌కులు రిలాక్స్‌గా స‌మాధానం ఇచ్చార‌ని అంటున్నారు. పార్టీ ముఖ్య‌నేత‌లు, మంత్రులు క‌లిసి అన్నాడీఎంకే భ‌విష్య‌త్ కోణంలో విలీనం నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వివ‌రించిన‌ట్లు స‌మాచారం. ఈ నిర్ణ‌యం ఒప్పుకోక త‌ప్ప‌ద‌ని అల్టిమేటం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా...ప‌ద‌వుల‌కు స్వ‌చ్ఛందంగా రాజీనామా చేయాల‌ని సైతం తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం. దీంతో షాక్ తిన్న దిన‌క‌ర‌న్ స‌ద‌రు నాయ‌కులు వెళ్లిన త‌ర్వాత స‌న్నిహితులైన కొంద‌రు నేత‌ల‌తో స‌మావేశం అయి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ గురించి చ‌ర్చించిన‌ట్లు చెప్తున్నారు.