Begin typing your search above and press return to search.

అమ్మ వచ్చే ముందు సీసీ కెమేరాల్ని తీసేశారట

By:  Tupaki Desk   |   2 March 2017 2:25 PM GMT
అమ్మ వచ్చే ముందు సీసీ కెమేరాల్ని తీసేశారట
X
రోజులు గడుస్తున్న కొద్దీ.. అమ్మ మరణం మీద అంతకంతకూ అనుమానాలు పెరిగేలా కొత్త వాదనలు బయటకు వస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న అమ్మను అర్థరాత్రి దాటిన తర్వాత.. హడావుడిగా చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించటం.. 75 రోజుల వైద్యం తర్వాత అమ్మ మరణించటంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అలాంటిదేమీ ఉండదంటూ పలువురు కొట్టి పారేసినా.. సామాన్య జనం మాత్రం అమ్మ మరణం సహజం ఎంతమాత్రం కాదన్న మాటను చెప్పటం కనిపించింది.

అయితే..అమ్మకు అపోలోలో వైద్యం చేసేటప్పుడు.. మరణించిన వేళలోనూ అన్నాడీఎంకే నేతలు ఒక్క మాట అంటే ఒక్క మాటను కూడా అనని వారు.. ఇప్పుడు అమ్మ మరణంపై కొత్త కొత్త వాదనల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే.. ఈ వాదనల్లో లాజిక్ ఉండటం.. అనుమానాలుబలపడేలా ఉండటం గమనార్హం. తాజాగా ఇప్పుడు అలాంటి వాదనేఒకటి తెరపైకి తీసుకొచ్చారు అన్నాడీఎంకే నేత పీహెచ్ పాండ్యన్.

ఆయన చేసిన సంచలన ఆరోపణ ఇప్పుడు అమ్మ మరణంపై మరిన్ని అనుమానాలు రేకెత్తించేలా ఉండటం గమనార్హం. ఇంతకీ పాండ్యన్ చేసిన ఆరోపణ ఏమిటన్నది చూస్తే.. పోయెస్ గార్డెన్ లో అమ్మను తోసేశారని.. దీంతో ఆమె కిందకు పడిపోయారని.. తర్వాతేం జరిగిందో చాలామందికి తెలీదన్నారు. ఓ పోలీసు అధికారి అంబులెన్స్ పిలిపించారని.. అందులో జయలలితను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా వెల్లలడించారు. అపోలోకు అమ్మను తీసుకెళ్లిన సమయంలో ఆసుపత్రిలో ఉన్న 27 సీసీ కెమేరాల్ని తొలగించారంటూ సంచలన ఆరోపణ చేశారు.

అపోలో ఆసుపత్రిలో సీసీ కెమేరాల్ని ఎందుకు తొలగించారో.. అపోలో యాజమాన్యం వివరణ ఇవ్వాలని కోరారు. అంతేకాదు.. జయలలిత డిసెంబరు 4వ తేదీ సాయంత్రం 4.30 గంటల సమయంలో చనిపోతే.. అపోలో యాజమాన్యం మాత్రం డిసెంబరు 5వ తేదీ అర్థరాత్రి చనిపోయినట్లు ప్రకటించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరిన్ని సంచలన ఆరోపణలు చేస్తున్న పాండ్యన్ కు ఇలాంటి సమాచారం అంతా ఎలా తెలుసన్న ప్రవ్నకు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. తాను పర్సనల్ గా దర్యాప్తు చేసినట్లుగా ఆయన చెప్పుకోవటం విశేషం. మరి.. పాండ్యన్ పర్సనల్ దర్యాప్తులు ఇంకెన్ని విషయాలు బయటకువచ్చాయో ఒకేసారి చెప్పేస్తే సరిపోతుందిగా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/