Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌కోసం త్యాగాలు మొద‌ల‌యిపోయాయి

By:  Tupaki Desk   |   7 Jan 2017 7:41 AM GMT
చిన్న‌మ్మ‌కోసం త్యాగాలు మొద‌ల‌యిపోయాయి
X
తాము ఎంత భక్తిప‌రుల‌మో నిరూపించుకునేందుకు మ‌రోమారు త‌మిళ నాయ‌కులు పోటీప‌డుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అన్నా డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన చిన్నమ్మ శశికళ కోసం ఇప్పుడు పార్టీ మంత్రులు - ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఆమె కోసం మేం శాసనసభ స్థానాన్ని వదులుకుంటామంటే - మేము అంటూ త్యాగానికి ముందుకు వస్తున్నారు. ఇందులో కొందరు పార్టీ గ‌త ర‌థ‌సార‌థులైన ఎంజీఆర్‌ - జ‌య‌లలిత పోటీ చేసిన స్థానం నుంచి బ‌రిలో దిగాల‌ని కోరుతుండ‌గా...మ‌రికొంద‌రు తమ ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేస్తామ‌ని ప్ర‌తిపాదిస్తూ చిన్న‌మ్మ‌ దృష్టిలో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నైలోని ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి శశికళ పోటీ చేయాలని ఇప్పటికే పలువురు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. శశికళకు గట్టి పట్టు ఉన్న పైడీ ప్రాంతంలో ఏ స్థానం నుంచి పోటీ చేసినా ఆమె అవలీలగా విజయం సాధిస్తారని ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తాను రాజీనామా చేసి తన స్థానాన్ని ఆమెకు ఇస్తానని ఆండిపట్టు ఎమ్మెల్యే తంగ తమిళరసన్‌ పేర్కొన్నారు. 1984లో అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2001లో జయలలిత కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు శశికళ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు.ఇక చిన్నమ్మ కోసం ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదులుకునేందుకు శాసనసభ్యులు పోటీ పడుతుండడాన్ని గమనించిన మంత్రులు సైతం ముందుకు వస్తున్నారు. మంత్రి పదవితో పాటు - ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకునేందుకు తాము సిద్ధమని చెబుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎవరూ బహిరంగంగా ఆ ప్రకటన చేయలేదు.

తమిళనాడులో ఇప్పుడు అంతా దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పేరు మారుమోగుతుంటే, జయ సొంత నియోజకవర్గం ప్రజలు మాత్రం ఆమెను స్వాగతించేందుకు ముందుకు రావడం లేదు. ఆమె తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓట్లు వేయబోమని పలువురు స్పష్టం చేస్తుండడం గమనార్హం. జయలలిత మరణించి 30 రోజులు అయిన సందర్భంగా ఆర్‌ కే నగర్‌ పార్టీ నేత - న్యాయవాది పీ వెట్రివేల్‌ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా పలువురు శశికళకు వ్యతిరేకంగా మాట్లాడారు. "మేము కేవలం అమ్మకు విధేయులం. చిన్నమ్మకు చెప్పండి, ఆమె వస్తే మేము ఓట్లు వేయబోము" అని సీనియర్‌ సిటిజన్‌ పి. కుప్పు వ్యాఖ్యానించగా, "అమ్మ ఆసుపత్రిలో 77 రోజులు ఉంటే, ఒక్కసారి కూడా ఆమెను మాకు చూపని శశికళకు మద్దతు ఇచ్చేది లేదు" అని వి. పద్మ అనే మహిళా కార్యకర్త స్పష్టం చేశారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ మాత్రమే అమ్మకు నిజమైన వారసురాలని మరో మహిళా కార్యకర్త రాజ్యలక్ష్మి అన్నారు. కాగా, ఆర్‌ కే నగర్‌లో తనపై ఉన్న వ్యతిరేకత గురించి శశికళకు సైతం సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె అసెంబ్లీకి రావాలంటే, ఆర్‌ కే నగర్‌ బదులు మదురై నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని పలువురు సీనియర్‌ నేతలు సూచిస్తున్నట్టు సమాచారం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/