Begin typing your search above and press return to search.

రజినీపై అన్నాడీఎంకే నేతల ఆశలు..

By:  Tupaki Desk   |   7 Aug 2018 10:43 AM GMT
రజినీపై అన్నాడీఎంకే నేతల ఆశలు..
X
తమిళనాడులో జయలలిత మరణంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. అంతటి బలమైన నేత అన్నాడీఎంకేలో లేకపోవడంతో ఇప్పుడా పార్టీ నేతలు స్టార్ క్యాంపెయినర్ కోసం ఎదురుచూస్తున్నారు. అన్నాడీఎంకే ఇప్పుడు తమిళనాడులో అధికారంలో ఉంది. ఆ పార్టీకి బోలెడంతా క్యాడర్ ఉంది.. పార్టీపై ప్రజల్లో ఆదరణ ఉంది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఫలనిస్వామి - మాజీ సీఎం పన్నీర్ సెల్వంలు అమ్మ చాటు బిడ్డలుగానే ముద్రపడ్డారు తప్పితే పార్టీని ముందుండి నడిపించే సత్తా వీరికి లేదు.. ప్రజల్లో జయలలితకు ఉన్న స్టార్ ఇమేజ్ వీరికి లేదు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ ఓ బలమైన ప్రజాదరణ ఉన్న నేత కోసం ఎదురుచూస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ పై తమిళనాడు మంత్రి కే పాండియరాజన్ ప్రశంసలు కురిపించారు.. ఆయన మాట్లాడుతూ.. ‘రజినీకాంత్ తమతో కలిసి వస్తే అంతకన్నా ఆనందం లేదని వ్యాఖ్యానించారు. ఈ మాటలు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఓపీఎస్ కానీ ఈపీఎస్ కానీ జయలలిత సాధించిపెట్టిన అధికారాన్ని అనుభవించడానికే కానీ.. వీరికి మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే నేర్పు లేదని అన్నాడీఎంకే కార్యకర్తలు ఘంటా పథంగా చెబుతున్నారు. అందుకే జయలలిత లోటును భర్తీ చేసేందుకు రజినీకాంత్ పార్టీలోకి రావాలని కోరుతున్నారు..

అయితే రజినీకాంత్ రాకను ముఖ్యమంత్రి ఫలని - మంత్రి పన్నీర్ సెల్వం వ్యతిరేకిస్తున్నారు. రజినీ వస్తే తమ ఆటలు సాగవని.. ఆయన పార్టీ కార్యకర్తగా వస్తే తమకు అభ్యంతరం లేదని - నాయకత్వ బాధ్యతలు మాత్రం ఇవ్వమని లీకులు ఇస్తున్నారు.

మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలవడం కష్టమనే ప్రచారం అయితే జరుగుతోంది. అందుకే రజినీకాంత్ ను రావాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఒకవేళ రజినీ పార్టీ పెట్టినా ఆయన పార్టీలోకి వలసవెళ్లేందుకు అన్నాడీఎంకే నేతలు క్యూ కడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.