Begin typing your search above and press return to search.

అమ్మ స‌మాధి వ‌ద్ద పంచాయ‌తీ!

By:  Tupaki Desk   |   22 Jun 2022 11:30 PM GMT
అమ్మ స‌మాధి వ‌ద్ద పంచాయ‌తీ!
X
త‌మిళ‌నాడులో ఆల్ ఇండియా అన్నా ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (అన్నాడీఎంకే)లో ముసలం నెల‌కొంది. అన్నాడీఎంకే క‌న్వీన‌ర్ ప‌న్సీర్ సెల్వం, కో క‌న్వీన‌ర్ ప‌ళినిస్వామిల మ‌ధ్య పార్టీపై పెత్త‌నం కోసం ఆధిప‌త్య‌పోరు మొద‌లైంది. మొద‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య వివాదం ఉండ‌గా అదిప్పుడు తారాస్థాయిలో రాజుకుంద‌ని చెబుతున్నారు. అయితే అప్పట్లో ఒక‌రికి పార్టీ ప‌గ్గాలు, మ‌రొక‌రికి సీఎం ప‌ద‌వి అన్న కోణంలో చేరో ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ ప‌గ్గాలు ప‌న్నీరు సెల్వంకు, ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ప‌ళ‌నిస్వామికి అప్ప‌గించారు.

అయితే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ఓడిపోయి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వ‌చ్చింది. ఇక అప్ప‌టి నుంచి అన్నాడీఎంకేపై పెత్త‌నం కోసం మాజీ ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి ప్ర‌య‌త్నిస్తుండ‌టాన్ని ప‌న్నీరుసెల్వం అడ్డుకుంటున్నారు. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఈ వివాదం మ‌రింత ముదిరింది. ఇదే స‌మ‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

చెన్నై మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత సమాధి వద్ద కిరోసిన్‌ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్‌ చేశాడు. దీంతో పోలీసులు ఆ కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో జూన్ 23న‌ అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ భేటీ జ‌ర‌గ‌నుంది. అయితే దీనికి ముందే పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. అటు ప‌ళ‌నిస్వామి వ‌ర్గీయులు, ఇటు ప‌న్నీర్ సెల్వం వ‌ర్గీయులు త‌మ త‌మ డిమాండ్ ల‌తో పార్టీలో ఉద్రిక్త ప‌రిస్థితిని సృష్టిస్తున్నారు. జూన్‌ 23న(గురువారం) జరగబోయే మీటింగ్‌లో పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయనున్నార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ఈ స‌మావేశాన్ని అడ్డుకోవ‌డానికి ప‌న్నీర్ సెల్వం ప్ర‌య‌త్నిస్తున్నారు. పార్టీ క‌న్వీన‌ర్ ని తానేన‌ని .. కాబ‌ట్టి త‌న సంత‌కం లేకుండా పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ ఆ తీర్మానాన్ని ఆమోదించ‌డానికి వీల్లేద‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు ప‌న్నీర్ సెల్వం వ‌ర్గీయులు మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా కోర్టు ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోవ‌డానికి నిరాక‌రించింది.

పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ లోనే ఈ అంశం తేల్చుకోవాల‌ని సూచించింది. ప‌న్నీర్ సెల్వం జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ లో తీర్మానం ఆమోదం చెంద‌కుండా ఉండ‌టానికి అన్ని అవ‌కాశాల‌ను వాడుకుంటున్నారు. ఓవైపు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతోపాటు ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా ఫిర్యాదు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే వర్గపోరు వేడి.. అక్కడి రాజకీయాలను హీటెక్కిస్తోంది.