Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెసులో ఆ నేత‌ల‌కు ఏఐసీసీ డ‌బుల్ షాక్‌...!

By:  Tupaki Desk   |   17 May 2022 6:29 AM GMT
టీ కాంగ్రెసులో ఆ నేత‌ల‌కు ఏఐసీసీ డ‌బుల్ షాక్‌...!
X
తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు షాక్ త‌గ‌ల‌నుందా..? ఆ దిశ‌గా ఏఐసీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతుందా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 13 నుంచి 15 వ‌ర‌కు రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో జ‌ర‌గ‌నున్న మేధో మ‌థ‌న స‌ద‌స్సులో ముఖ్య‌మైన అంశం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌. ఆదివారం జ‌రిగిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో కూడా ఆ అంశంపైనే చ‌ర్చించార‌ట‌.

ఇదే క‌నుక అమ‌లైతే తెలంగాణ కాంగ్రెసులో ఉన్న ఉద్ధండుల‌కు మొండిచేయి చూపిన‌ట్లే. ఆ ప్ర‌ముఖ అంశం ఏమిటంటే ఒక కుటుంబం.. ఒక టికెట్‌.. అట‌. దేశ‌వ్యాప్తంగా పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయాల‌న్నా.. సామాన్య కార్య‌క‌ర్త వ‌ర‌కూ ఫ‌లాలు పొందాల‌న్నా ఒక‌రికి ఒకే ప‌ద‌వి.., ఒక కుటుంబంలో ఒకే టికెట్ లాంటివి అమ‌లు చేయాల‌ని మెజారిటీ నేత‌లు సూచిస్తున్నారు. ఇటీవ‌ల ప్ర‌శాంత్ కిశోర్ ఇచ్చిన ప్ర‌తిపాద‌న‌ల్లో ఇది కూడా ఉంద‌ట‌.

దీనిపై సీనియ‌ర్లు విముఖత వ్య‌క్తం చేస్తున్నా అధిష్ఠానం త‌ల‌చుకుంటే క‌చ్చితంగా అమ‌లవుతుంది. ఈ అంశం బ‌య‌టికి రావ‌డంతో ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెసులో ఉన్న డ‌జ‌న్ల కొద్దీ సీనియ‌ర్ నేత‌ల గుండెల్లో పిడుగు ప‌డిన‌ట్లు అయింది. ఉత్త‌మ్ దంపతులు.., కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌, జానారెడ్డి, జ‌గ్గారెడ్డి, కొండా దంపతులు.. త‌దిత‌ర నేత‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లే ప‌రిణామం ఇది.

ప్ర‌తీ ఎన్నిక‌ల్లో వీరి కుటుంబం నుంచే ఇద్ద‌రు ముగ్గురు నేత‌లు టికెట్ల కోసం పోటీప‌డుతుంటారు. కొన్ని సార్లు కొంద‌రు గెలిచారు కూడా. ముఖ్యంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ఈ పోటీ ఎక్కువ‌గా ఉంది. హుజూర్ న‌గ‌ర్ నుంచి ఉత్త‌మ్‌, కోదాడ నుంచి ఆయ‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌రైన వెంక‌ట రెడ్డి న‌ల్ల‌గొండ ఎమ్మెల్యేగా, ఆయ‌న త‌మ్ముడు రాజ‌గోపాల రెడ్డి భువ‌న‌గిరి ఎంపీగా గ‌తంలో.. మునుగోడు ఎమ్మెల్యేగా రాజ‌గోపాల రెడ్డి, భువ‌న‌గిరి ఎంపీగా వెంక‌ట రెడ్డి ప్ర‌స్తుతం కొన‌సాగుతున్నారు.

వీరే కాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇత‌ర కుటుంబాల నుంచి కూడా పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. జానారెడ్డి ఇద్ద‌రు కుమారులు బ‌రిలో నిల‌వాల‌ని భావిస్తున్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు పోటీకి ఆస‌క్తి చూపుతున్నారు. వ‌రంగ‌ల్ లో కొండా సురేఖ దంప‌తులు ఇద్ద‌రూ టికెట్ ఆశిస్తున్నారు. వీలైతే త‌మ కుమార్తెకు కూడా అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతున్నారు. సంగారెడ్డిలో తూర్పు జ‌గ్గారెడ్డి కూడా త‌న‌తో పాటు త‌న స‌తీమ‌ణి, కుమార్తెను కూడా బ‌రిలో దింపాల‌ని భావిస్తున్నారు.

సికింద్రాబాద్ లో అంజ‌న్ కుమార్ యాద‌వ్ తో పాటు ఆయ‌న కుమారుడు కూడా పార్టీ ఆదేశిస్తే పోటీలో ఉంటామంటున్నారు. క‌రీంన‌గ‌ర్ లో దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబుతో పాటు ఆయన సోద‌రుడు.., నాగ‌ర్ క‌ర్నూలులో నాగం జానార్ద‌న్ రెడ్డితో పాటు ఆయ‌న త‌న‌యుడు.., భ‌ట్టి విక్ర‌మార్క ఆయ‌న సోద‌రుడు మ‌ల్లు ర‌వి.., ఇలా టీ కాంగ్రెసులో డ‌బుల్ ఇంజిన్ లిస్టు చాంతాండంత ఉంది. మ‌రి ఏఐసీసీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో.. వీరంతా ఎటువైపు అడుగులు వేస్తారో వేచి చూడాలి.