Begin typing your search above and press return to search.

కరోనా నుంచి కోలుకున్నాక ఆరోగ్య సమస్యలపై ఎయిమ్స్ షాకింగ్ రిపోర్టు

By:  Tupaki Desk   |   5 Oct 2022 5:12 AM GMT
కరోనా నుంచి కోలుకున్నాక ఆరోగ్య సమస్యలపై ఎయిమ్స్ షాకింగ్ రిపోర్టు
X
మాయదారి కరోనాతో ఎన్ని చిక్కులు.. మరెన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పేసింది ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తాజా అధ్యయనం. కరోనా సోకి దాని నుంచి కోలుకున్న తర్వాత.. మునుపటి మాదిరిగా ఆరోగ్యం ఉండటం లేదన్న మాట తరచూ పలువురి నోటి నుంచి వింటు ఉంటాం. ఇందులో నిజం ఎంత? అన్న విషయానికి సంబంధించి శాస్త్రీయతపై బోలెడన్ని సందేహాలు ఉన్నాయి.

తాజాగా ఎయిమ్స్ నిర్వహించిన అధ్యయనం.. దాని వివరాల్ని డోవ్ ప్రెస్ మెడికల్ జర్నల్ లో పబ్లిష్ అయ్యింది. ఇందులో వెలువడిన కీలక విషయాల్ని తెలిస్తే నోటి వెంట మాట రానంత షాక్ కు గురవుతాం. కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్య పరంగా కుదేల్ అవుతారన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించటమే కాదు.

దాని తీవ్రత ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పేసింది. కొవిడ్ సోకి కోలుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఆరోగ్య సమస్యల మాటేమిటి? అన్న అంశంపై దేశ వ్యాప్తంగా 1800 మందిని ఎంపిక చేసి.. వారితో ఫోన్లో సంభాషించారు. వారి దినచర్య గురించి పలు ప్రశ్నల్ని వేశారు.

ఈ క్రమంలో బోలెడన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. కరోనా మొదటి.. రెండో వేవ్ లో మహమ్మారి బారిన పడిన రోగుల్ని ఎంపిక చేసి.. వారిని పలు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా వారు చెప్పిన సమాధానాల్ని క్రోడీకరించినప్పుడు అధ్యయనం చేసిన 1800 మందిలో 79.3 శాతం మంది తాము అలసటను ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొన్నారు. 33.4 శాతం మంది కీళ్ల నొప్పులు.. 29.9 శాతం మంది గౌట్.. 28 శాతం మంది జుట్టు రాలటం.. 27.2 శాతం తలనొప్పి సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. అంతేకాదు.. 25.3 శాతం మందికి శ్వాస ఆడని సమస్యల్ని ఎదుర్కొంటుంటే.. 25. 3 శాతం నిద్రలేమి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లుగా గుర్తించారు.

కరోనాకు ముందు కిలోమీటర్లు కొద్దీ అలవోకగా నడిచిన వారు.. కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత మాత్రం.. కాస్తంత దూరం నడిచినా అలిసిపోతున్న విషయాన్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు.

కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు డెవలప్ కావటమే కాదు.. దాని సంక్రమణ నిరోధించిన విషయాన్ని గుర్తించారు. పోస్టు కొవిడ్ గా అనుమానించిన వారిలో 39 శాతం మందిలో లక్షణాలు పెరగకుండా సేవ్ చేసినట్లుగా తేల్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.