Begin typing your search above and press return to search.

బుల్లెట్ పై అసద్..కేసీఆర్ తో కీలక భేటి

By:  Tupaki Desk   |   10 Dec 2018 10:53 AM GMT
బుల్లెట్ పై అసద్..కేసీఆర్ తో కీలక భేటి
X
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ కు సోమవారం మధ్యాహ్నం సాధారణ వ్యక్తిలా ఓ బుల్లెట్ పై రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసదుద్దీన్ బైక్ పై రావడం మీడియా కంట పడడంతో ఈ విషయం వెలుగుచూసింది. అసదుద్దీన్ వెంట కనీసం తన తమ్ముడు .. ఎంఐఎం శాసన సభ పక్ష నేత అక్బరుద్దీన్ ను కూడా వెంట తెచ్చుకోకపోవడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో వీరి లంచ్ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటికి ముందు అసదుద్దీన్ టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించి ఈరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలుస్తున్నానని ప్రకటించారు. కేసీఆర్-అసదుద్దీన్ భేటి తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచింది.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వేళైంది. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం మద్దతు ప్రకటించడం టీఆర్ఎస్ కు కొండంత బలాన్ని ఇచ్చినట్టైంది. అంతకుముందు రోజే కేసీఆర్ కు ఫోన్ చేసిన అసదుద్దీన్ తాజాగా సోమవారం మధ్యాహ్నం ఒంటరిగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు బైక్ పై వచ్చి కలిశారు. కేసీఆర్ తో లంచ్ లో భేటి తాజా రాజకీయాలు, పరిణామాలపై చర్చించినట్టు సమాచారం.

కేసీఆర్ తో సమావేశానికి ముందు అసదుద్దీన్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘తెలంగాణ కేర్ టేకర్, కాబోయే సీఎం కేసీఆర్ ను కలువబోతున్నాను.. సీఎం కేసీఆర్ మరోసారి సీఎం కావాలని తాము కోరుకుంటున్నామని.. అల్లా దయ వల్ల ఆయన సొంతంగా మెజార్టీ తెచ్చుకోవాలని.. లేకపోయినా ఎంఐఎం మద్దతు కేసీఆర్ కేనని ప్రకటించారు. జాతిని ధృడంగా నిలబెట్టడానికి తాము ఇద్దరం ముందడుగు వేస్తున్నామని అసద్ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఎంఐఎం హైదరాబాద్ లోని ఏడు సీట్లలో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. అనాదిగా పెట్టని కోటల్లా ఆ సీట్లు మజ్లిక్ కు ఉన్నాయి. ఫలితాలకు ముందే ఎంఐఎం టీఆర్ ఎస్ కు మద్దతు ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాల్లో వేడి రగులుకుంది. ఎంఐఎం అధినేత టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలవడం కాంగ్రెస్ శిబిరంలో కలవరపాటుకు గురిచేస్తోంది. మరి రేపటి ఫలితాల్లో ఏం జరుగనుందనేది వేచి చూడాలి.