Begin typing your search above and press return to search.

పోస్ట్ కొవిడ్.. ఎయిమ్స్ షాకింగ్ అధ్యయన ఫలితాలు!

By:  Tupaki Desk   |   1 July 2021 12:30 PM GMT
పోస్ట్ కొవిడ్.. ఎయిమ్స్ షాకింగ్ అధ్యయన ఫలితాలు!
X
కరోనా బారిన పడి కోలుకోవడం ఓ ఎత్తు అయితే దాని అనంతరం వచ్చే ఆరోగ్య సమస్యలు మరో తలనొప్పిగా మారాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వివిధ దశల రూపాల్లో కోరలు చాస్తోంది. వైరస్ ధాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలు ఉన్నవారిపై వైరస్ నుంచి కోలుకున్న తర్వాత తీవ్ర ప్రభావం పడుతోందని వైద్య నిపుణులు అంటున్నారు.

కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? అనే అంశంపై ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఓ సర్వే నిర్వహించింది. టెలీకాల్ ద్వారా ఎయిమ్స్ నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మధుమేహం ఉన్న వారిలో కొవిడ్ అనంతరం షుగర్ స్థాయులు అసాధారణ స్థాయిలో పెరిగినట్లు ఆ నివేదిక వెల్లడించింది.

మొత్తం 3 వేల మందిని ఫోన్ కాల్ ద్వారా సర్వే చేసినట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఇందులో భాగంగా 11 రకాల అనారోగ్య సమస్యలను గురించి ఆరా తీసినట్లు పేర్కొన్నారు. కాగా వారిలో ఎక్కవ మంది కరోనా తర్వాత ఇతర సమస్యల బారిన పడినట్లు చెప్పారని అన్నారు. వైరస్ నుంచి విముక్తి పొందిన వారిలో 16 శాతం మందిలో షుగర్ స్థాయులు తీవ్రంగా పెరిగినట్లు తెలిపారు.

ఎయిమ్స్ నిర్వహించిన ఈ సర్వేలో 28 శాతం మంది బలహీనత సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొన్నారు. 21.5 శాతం మంది నీరసం బారిన పడ్డారని వెల్లడించారు. మరికొంత మంది దగ్గు, రక్తపోటు, గ్యాంగ్రేన్, బ్లాక్ ఫంగస్, ఆందోళన, ఇతర మానసిక సమస్యల బారిన పడ్డారని ఆ సర్వేలో తెలిపారు.

ఎయిడ్స్ ఉన్న వారిలో చాలామంది వైరస్ బారిన పడకుండా ఉన్నారని ఎయిమ్స్ తెలిపింది. నవంబర్ లో నిర్వహించిన ఓ సర్వేలో హెచ్ఐవీ ఉన్నవారిపై కరోనా ప్రభావం తక్కువేనని పేర్కొంది. ఎయిడ్స్ ఉన్న 164 మంది రక్త నమూనాలను పరీశీలించగా వారిలో 16 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలను గుర్తించినట్లు వెల్లడించింది.