Begin typing your search above and press return to search.

బాబు పుణ్యాన రాజు గారు ఇరుక్కున్నారా?

By:  Tupaki Desk   |   5 Jun 2018 10:00 AM GMT
బాబు పుణ్యాన రాజు గారు ఇరుక్కున్నారా?
X
ప్ర‌ముఖ టీడీపీ నేత‌ - మాజీ కేంద్ర మంత్రి అశోక‌గ‌జ‌ప‌తి రాజుకు రాజకీయాల్లో క్లీన్ చిట్ ఉంది. ఉన్న‌త విద్యావంతుడిగా - అవినీతికి దూరంగా ఉంటార‌ని ఆయ‌న‌కు పేరుంది. ఇన్నేళ్ల రాజ‌కీయంలో ఆయ‌న త‌న స్థాయికి తగ్గి వ్య‌వ‌హ‌రించిన‌ట్లు గానీ, రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ప‌రుష‌ప‌ద‌జాలం ఉప‌యోగించిన‌ట్లుగా గానీ ఎక్క‌డా క‌నిపించ‌దు. అయితే ఇటీవ‌ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప‌నిచేసి రాజీనామా చేసిన అశోక‌గ‌జ‌ప‌తిరాజు మంత్రిగా తీసుకున్న ఓ నిర్ణ‌యం క‌ల‌క‌లం రేపుతోంది. దాని వెన‌క చంద్ర‌బాబు ఉన్నాడ‌ని ఆయ‌న మాట‌లు విని ఇప్పుడు ఈయ‌న ఇరుక్కుపోయాడ‌ని అంటున్నారు.

ఎయిర్ ఏషియా కుంభ‌కోణం టేపులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో పాటు అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎయిర్ ఏషియా సిఇఓల సంబాషణలలో చంద్ర‌బాబుతో పాటు అశోక‌గ‌జ‌ప‌తిరాజు పేర్లు ఆ టేపుల‌లో ఉన్న‌ట్లు, చంద్ర‌బాబును ప‌ట్టుకుంటే ప‌ని అయిపోతుంది అని వారిద్ద‌రూ మాట్లాడుకున్న‌ట్లు వెల్ల‌డ‌యిన‌ట్లు స‌మాచారం. మలేషియాకు చెందిన బడ్జెట్‌ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ఎయిర్‌ ఏషియా 2014లో టాటా గ్రూపుతో కలిసి దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టడ‌మే ఈ దుమారానికి కార‌ణం.

నిబంధనల ప్రకారం స్థానికంగా 5 ఏళ్లు సర్వీసులు నడిపి, 20 విమానాలు కలిగిన ఉన్న సంస్థలకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అనుమ‌తి ఇవ్వాల‌ని అప్ప‌ట్లో నిబంధ‌న ఉండేది. విమాన‌యానరంగంలో దీనిని 5/20 నిబంధ‌న‌గా చెబుతుంటారు. దీనికి విరుద్దంగా ఎయిర్‌ ఏషియా ఇండియాకు విదేశీ సర్వీసులు నడపడం కోసం పెద్ద ప్ర‌య‌త్నాలే చేసింది. కానీ దీన్ని స్పైస్‌ జెట్ - జెట్‌ ఎయిర్‌ వేస్‌ వంటి స్థానిక విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఇంత జ‌రిగినా జూన్ - 2016లో 5/20 నిబంధనను సవరిస్తూ అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరణ ప్రకారం ఐదేళ్ల సర్వీసు లేకుండా కేవలం 20 విమానాలు ఉంటే అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చని అందులో పేర్కొన్నారు. ఈ నిబంధన స‌వ‌ర‌ణ మూలంగా మలేషియాకు చెందిన ఎయిర్‌ ఏషియా - విస్తారా సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ కు భారీ ప్రయోజనం జరిగింది. దేశీయ విమాన‌యాన‌రంగంలోకి అడుగుపెట్టిన రెండేళ్ల‌లోనే ఎయిర్ ఏషియా అనుమ‌తుల‌ను ద‌క్కించుకుంది. ఈ స‌వ‌ర‌ణ కోసం జ‌రిగిన ప్ర‌య‌త్నాల సంధ‌ర్భంగా జ‌రిగిన సంభాష‌ణ‌ల టేపు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అస‌లే టీడీపీ కేంద్రంతో సంబంధాలు తెచ్చుకుని బ‌ద్ద‌శత్రువుగా మారిన ఈ ప‌రిస్థితుల‌లో ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డికి పోతుందో అని అంతా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.