Begin typing your search above and press return to search.

బీజేపీ స్పెషల్ ఫ్లైట్ జర్నీలో ఏం జరిగిందో తెలుసా?

By:  Tupaki Desk   |   26 May 2016 11:27 AM GMT
బీజేపీ స్పెషల్ ఫ్లైట్ జర్నీలో ఏం జరిగిందో తెలుసా?
X
తాజాగా ఎయిర్ ఇండియాకు చెందిన ఒక ఫ్లైట్ లో బీజేపీకి చెందిన అతిరథ మహారథులంతా కలిసి ఫ్లైట్ జర్నీ చేశారు. దాదాపు వందకు పైనే బీజేపీ నేతలు ప్రయాణించిన విమానానికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ నుంచి గౌహతికి వెళ్లిన ఈ విమానంలో కేంద్రమంత్రులు మొదలుకొని వీవీఐపీలంతా విమానంలో ఉండటం ఒక ఎత్తు అయితే.. వారి ప్రయాణం ఎలా సాగిందన్నది మరో ఆసక్తికరమైన అంశం.

మరి.. కేంద్రమంత్రులు.. నుంచి టాప్ వీఐపీలు ప్రయాణించిన విమానంలో జర్నీ ఎలా సాగుతుంది? అత్యున్నత స్థాయి కమలనాథులంతా ఒక ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు ఏం చేస్తారు? వారి మధ్య ఎలాంటి ముచ్చట్లు వస్తాయి? విమానంలో వారు ఎలా వ్యవహరిస్తారు? ఎవరు ఎక్కడ కూర్చుంటారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఎంత ఆసక్తి. ఇంతకీ ఇంతమంది బీజేపీ అగ్రనేతలు ఢిల్లీ నుంచి గౌహతికి వెళ్లాల్సిన అవసరం ఏమిటన్న డౌట్ వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. ఈశాన్య భారతంలో తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రిగా సోనోవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ ముఖ్య పరివారం బయలుదేరింది. ఈ ప్రయాణంలో చోటు చేసుకున్న సంగతులు చూస్తే..

= పలువురు కేంద్రమంత్రులు బిజినెస్ క్లాస్ లో కూర్చుంటే.. జూనియర్ మంత్రులు.. వీఐపీలు ప్రీమియం ఎకానమీ సీట్లలో కూర్చున్నారు.

= రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చిన్న ట్రావెల్ బ్యాగులో విమానం ఎక్కారు.

= అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్లేబ్యాక్ సింగర్ బాబుల్ సుప్రియోతో బీసీసీఐ అనురాగ్ ఠాకూర్ ముచ్చట్లలో పడిపోయారు.

= సుప్రియోను పలువురు నేతలు పాటలు పాడాలని కోరినా.. తన గొంతు బాగోలేదని పాటలు పాడేందుకు నో అనేశారు.

= విమానం బయలుదేరే వరకూ ఎక్కువమంది నేతలు సెల్ ఫోన్లలో బిజీబిజీగా కనిపించారు.

= ఫ్లైట్ టేకాప్ అయి.. సీటు బెల్టెలు తొలగించుకోవచ్చన్న సందేశం వెలువడగానే కబుర్లలో కొందరు మునిగిపోతే.. మరికొందరు కునుకు తీశారు.

= కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను పలువురు ఈసారి ఎక్కడ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారన్న ప్రశ్నలు వినిపించాయి.

= వెంకయ్యనాయుడు ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రశ్నలు వచ్చాయి.

= కర్ణాటక నుంచి ఎవరిని బరిలోకి దించుతున్నారన్న చర్చ కూడా జరిగింది.

= పలువురు మంత్రులు.. ఇతర ప్రజానిధులు ఎవరికి వారుగా కూర్చొని లోగొంతుతో మాట్లాడుకున్నారు.

= విమానం దిగిన తర్వాత ప్రమాణస్వీకారానికి సంబంధించిన వివరాల్ని లైవ్ లో ట్వీట్స్ చేస్తానంటూ రైల్వే మంత్రి పలువురికి చెప్పటం కనిపించింది.

= విమానం ఎక్కిన దగ్గర నుంచి దిగేంతవరకూ చాలామంది నేతలు ఎవరితో ఒకరితో మాట్లాడటం కనిపించింది.