Begin typing your search above and press return to search.

ఉద్యోగం అంటే లవ్‌ మ్యారేజీ లాంటిది!!

By:  Tupaki Desk   |   15 Sep 2015 4:14 AM GMT
ఉద్యోగం అంటే లవ్‌ మ్యారేజీ లాంటిది!!
X
ఒక రకంగా చూస్తే.. కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవడం కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం లాంటిదే. అమ్మాయి వెంటపడి ప్రేమిస్తూ ఉన్నంత కాలమూ అమ్మాయిని ప్రసన్నం చేసుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.. ఆమె చెప్పిందల్లా చేస్తుంటారు... అదే అమ్మాయితో ఒకసారి పెళ్లయిపోయిన తర్వాత.. ఇక మనదే అనే ఫీలింగ్‌ వచ్చేసిన తర్వాత.. నిర్లక్ష్యం చొరబడిపోతుంది. ఉద్యోగం విషయం కూడా అంతే.. దాన్ని సంపాదించుకోవడం వరకూ దానికోసం ఇంటర్వ్యూలకు ప్రిపేర్‌ అవుతూ నాలెడ్జి పరంగా అప్‌ డేట్‌ కావడమూ ఫిట్‌ నెస్‌ మెయింటైన్‌ చేయడమూ జరుగుతుంది. ఉద్యోగం రాగానే ఇక గెయినింగ్‌ నాలెడ్జి - ఫిట్‌ నెస్‌ మీద శ్రద్ధ పోతుంది.

ఇప్పడు ఎయిరిండియాలో కూడా జరుగుతున్న గొడవ అదే. అనూహ్యంగా బరువు పెరిగిపోయిన ఉద్యోగులను ఇతరత్రా విధులకు ట్రాన్స్‌ ఫర్‌ చేసి.. కొందరిని విధుల్లోంచి తొలగించి ఎయిరిండియాను క్రమబద్ధీకరించడానికి సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి సంస్కరణ నిర్ణయాల పట్ల ఉద్యోగులు సహజంగానే కన్నెర్ర చేస్తున్నారు. ఉండాల్సిన బరువు కంటె బాగా ఎక్కువ బరువుతో ఉన్న 600 మందికి వీరు బరువు తగ్గడానికి గడువు ఇచ్చారు. తగ్గలేకపోయిన వారిలో 125 మందిని ప్రస్తుతం బదిలీచేస్తున్నారు.

లవ్‌ మ్యారేజీ కూడా అంతే.. పెళ్లయిన తర్వాత.. భార్య ఇక మనదే కదా అనే ఇంప్రెషన్‌ పడిపోగానే.. శ్రద్ధ పలచబడిపోతుంది. ఆమె చెప్పిందల్లా చేయడమూ... ఆమెను ఎట్రాక్ట్‌ చేయడానికి ప్రతిరోజూ తపనపడుతూ ఉండడమూ.. ఇలాంటి ప్రయత్నాలన్నీ అటకెక్కుతాయి. దెన్‌ ప్రాబ్లం స్టార్ట్స్‌.. భార్యలో అసంతృప్తి మొదలవుతుంది. నిన్నటి దాకా తనకోసం పడిచచ్చిపోయిన వాడు.. ఇప్పుడు నెగ్లెక్ట్‌ చేస్తున్నతీరు బాధ కలిగిస్తుంది. అలాంటి అసంతృప్తులు ముదిరాయంటే.. ఇద్దరూ తగాదాలు పడుతూ ఉంటారు. అది పెటాకులకు దారితీస్తుంది.

ఇప్పుడు ఎయిరిండియా ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే తయారవుతోంది. ప్రమాణాల మేరకు శరీర బరువు పాటించని వారిని వాలంటరీ రిటైర్‌ మెంట్‌ ఇచ్చి పంపేయాలని సంస్థ చూస్తోంది. దానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనకు దిగబోతున్నారు. అన్ని చికాకులూ మొదలవుతున్నాయన్నమాట.

అవును కదా.. ఈ ఎయిరిండియా ఉద్యోగుల పోలికను గమనిస్తోంటే.. ఉద్యోగం పొందడం కాపాడుకోవడం అనేది, లవ్‌ మ్యారేజీ చేసుకోవడం నిలబెట్టుకోవడంతో సమానంగా కనిపిస్తోంది. కదా.. హతవిధీ అంటే అదేమరి!