Begin typing your search above and press return to search.
మోదీ సర్కార్ అతి పెద్ద కుంభకోణం అదే:స‌్వామి
By: Tupaki Desk | 1 April 2018 4:49 AM GMTబీజేపీ రాజ్యసభ సభ్యుడు - ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఆయన ప్రత్యేకత. స్వపక్షం - ప్రతిపక్షం - తన - మన తారతమ్యాలు లేకుండా.....నిర్మొహమాటంగా వ్యాఖ్యానించడం ఆయనకు పరిపాటి. చాలాసార్లు బీజేపీపైన - ఆ పార్టీ నేతలపైన స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పదవికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని కొద్ది రోజుల క్రితం స్వామి డిమాండ్ చేయడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ఫైర్ బ్రాండ్.....మరోసారి మోదీ సర్కార్ పై మండిపడ్డారు. ఎయిరిండియాలో వాటాలను విక్రయించాలనుకోవడం మోదీ సర్కార్ చేస్తోన్న అతిపెద్ద కుంభకోణం అవుతుందని స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆ డీల్ ను వ్యతిరేకిస్తూ తాను స్వయంగా ప్రైవేట్ క్రిమినల్ లా ఫిర్యాదును దాఖలు చేయనున్నట్టు మరో బాంబు పేల్చారు.
ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయం సరైన నిర్ణయం కాదని - ఆ విషయాన్ని తాను ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నానని అన్నారు. `ఎయిరిండియా డీల్` విషయంలో మోదీ సర్కార్ కదలికలను తాను నిశితంగా పరిశీలిస్తున్నానని, ఈ డీల్ కు సూత్రధారి ఎవరో తనకు తెలుసని స్వామి అన్నారు. తన దృష్టికి వచ్చే అవకతవకలపై నిస్సందేహంగా ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో సహించబోనని స్వామి చెప్పారు. `ఎయిరిండియా`లో 76 శాతం వాటాలను అమ్మాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎయిర్ ఇండియాలో డిజిన్వెస్ట్ మెంట్ జరిగితే సంస్థ యాజమాన్య హక్కులు ప్రైవేటు సంస్థలకు లేదా విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్తాయి. అందుకే, స్వామి ఆ డీల్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఇప్పటికే రూ. 52 వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా మూతపడకుండా ఉండాలంటే వాటాలు విక్రయించక తప్పదనేది కేంద్రం వాదన. 6 సంవత్సరాల క్రితం అప్పటి యూపీఏ సర్కార్ ఎయిరిండియాకు రూ. 30 వేల కోట్లతో ఉద్దీపన కల్పించింది. అయినా, ఇప్పటికీ ఆ సంస్థ అప్పుల్లోనే ఉంది.