Begin typing your search above and press return to search.

ఎయిరిండియా సంచలన నిర్ణయం ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నట్లు?

By:  Tupaki Desk   |   4 April 2020 3:45 AM GMT
ఎయిరిండియా సంచలన నిర్ణయం ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నట్లు?
X
కరోనాను కంట్రోల్ చేసే క్రమంలో దేశ వ్యాప్తంగా ఇరవై ఒక్కరోజుల లాక్ డౌన్ ను ప్రకటిస్తూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనికి తగ్గట్లే.. దేశ వ్యాప్తంగా ఇప్పుడు పరిమితుల మధ్య జనజీవనం సాగుతోంది. ఎంతో అవసరం అయితే తప్పించి వీధుల్లోకి రావొద్దంటూ ఆంక్షలు విధించటం తెలిసిందే. కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల (ఏప్రిల్) 14తో ముగుస్తుంది? తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అన్నదిప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.

ప్రజల్లో ఉన్న ఆసక్తి నేపథ్యంలో పలు వైరల్ వార్తలు పుట్టుకు రావటం.. కేంద్రం తన లాక్ డౌన్ ను మరింతగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటుందన్న తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇలా చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు కూడా. అదే సమయంలో లాక్ డౌన్ ను పొగిడించే పరిస్థితులు లేవన్న రీతిలో పలువురి మాటలు ఉన్నా.. వాస్తవం మాత్రం అంతుబట్టని విధంగా మారింది.

ఇలాంటివేళ.. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా తీసుకున్న సంచలన నిర్ణయం లాక్ డౌన్ విషయంలో ఏం జరుగుతుందన్న అంశంపై కాస్త క్లారిటీ ఇచ్చేలా ఉందంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఒక కొలిక్కి రాకపోవటం.. గడిచిన నాలుగైదు రోజులుగా కేసుల సంఖ్య క్రమపద్దతిలో పెరగటమే కాదు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఇలాంటివేళ.. తమ విమాన సర్వీసుల్ని ఏప్రిల్ 30 వరకూ నడపకూడదని ఎయిరిండియా నిర్ణయించింది.

కేంద్రం విధించిన లాక్ డౌన్ 14తో ముగుస్తుంటే.. తన విమాన సర్వీసుల్ని ఏప్రిల్ 30 వరకూ నిలిపివేయాలని ఎయిరిండియా నిర్ణయం తీసుకోవటంతో లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందా? అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు ప్రైవేటు విమాన సంస్థలైన ఇండిగో.. స్పైస్ జెట్.. గోఎయిర్ విమానసంస్థలు తమ దేశీయ విమాన సర్వీసుల్ని ఏప్రిల్ 15 నుంచి నడిపేందుకు వీలుగా టికెట్ల బుకింగ్స్ ను ప్రారంభించాయి. అయితే.. ఇప్పటిపరిస్థితుల్లో బుకింగ్స్ స్టార్ట్ చేసినా.. ఏప్రిల్ 14 నాటికి పరిస్థితులు అదుపులోకి రాని పక్షంలో లాక్ డౌన్ పొడిగించటమే కాదు.. తమ బుకింగ్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం పెద్ద విషయం కాదంటున్నారు. ఏమైనా ఎయిరిండియా నిర్ణయం చూసినప్పుడు లాక్ డౌన్ పొడిగింపు తప్పదన్న అభిప్రాయం కలుగక మానదు.