Begin typing your search above and press return to search.

ఇక డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో నో నాన్‌ వెజ్‌!

By:  Tupaki Desk   |   10 July 2017 9:53 AM GMT
ఇక డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో నో నాన్‌ వెజ్‌!
X
ఇప్ప‌టికే పీక‌ల్లోతు న‌ష్టాల్లో కూరుకుపోయి ప్ర‌భుత్వానికి భారంగా మారిన ఎయిరిండియా ఇప్పుడు ఖ‌ర్చు తగ్గించుకునే ప‌నిలో ప‌డింది. ఇక నుంచి దేశీయ విమానాల్లోని ఎకాన‌మీ క్లాస్ ప్ర‌యాణించేవారికి కేవ‌లం శాకాహారమే ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. అయితే అంత‌ర్జాతీయ విమానాల్లో మాత్రం నాన్‌ వెజ్ కొన‌సాగిస్తామ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌మ‌కు ఏడాదికి 7-8 కోట్లు ఆదా అవుతుంద‌ని ఎయిరిండియా సీనియ‌ర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. దేశీయ విమాన దిగ్గ‌జ‌మైన ఎయిరిండియా ఇప్ప‌టికే రూ.52 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విష‌యం తెలిసిందే. అందుకే ఈ నేష‌న‌ల్ కారియ‌ర్‌ ను వ‌దిలించుకునే ప‌నిలో ప్ర‌భుత్వం ఉంది. ఎయిరిండియా అమ్మ‌కం ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసింది. మొత్తంగా ఒకేసారి కాకుండా.. సంస్థ‌ను విభజించి అమ్మాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. ఇండిగో - టాటా రేసులో ఉన్నాయి.

అయితే ఎయిరిండియా అమ్మ‌కాన్ని ఆ సంస్థ ఉద్యోగులు వ్య‌తిరేకిస్తున్నారు. అందుకే గ‌త నెల‌లో ఖ‌ర్చు త‌క్కువయ్యే ఎన్నో సూచ‌న‌లు మేనేజ్‌ మెంట్‌ కు చేశారు. మీల్స్ నుంచి సలాడ్‌ ను తీసేయ‌డం కూడా ఇందులో ఒక‌టి. అంతేకాదు ప్ర‌తి సీటుకో మ్యాగ‌జైన్ ఉంచ‌కుండా.. ర్యాక్స్‌ లో పెట్టి బ‌రువు త‌గ్గించే ఐడియాలు కూడా ఇచ్చారు. అయితే ఈ చ‌ర్య‌ల‌న్నీ చేపట్టినా ఇప్ప‌టికీ చాలా ఆల‌స్యం జ‌రిగిపోయింది. మ‌రోవైపు ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణకు గతనెల 28న కేంద్ర క్యాబినెట్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్‌ ఇండియా, దాని అనుబంధ విభాగాల్లో వ్యూహాత్మక వాటా విక్రయానికి క్యాబినెట్ సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో - జెట్‌ ఎయిర్‌ వేస్ వంటి ప్రైవేట్ సంస్థలు క్రమంగా ఎదుగుతూ అగ్ర స్థాయికి.. ప్రభుత్వ సంస్థ ఎయిర్‌ ఇండియా మాత్రం సంక్షోభంలో ల్యాండ్ అయింది. దేశీయ ఎయిర్‌ లైన్ మార్కెట్‌ లో సంస్థ వాటా ప్రస్తుతం 14 శాతానికి పడిపోయింది. దాదాపు రూ.55 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను పునరుద్ధించేందుకు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ కింద ఇప్పటివరకు రూ.23,200 కోట్ల మేర నిధులు సమకూర్చింది. దాంతో కాస్త కోలుకున్నప్పటికీ ఆశించిన స్థాయి ప్రగతి మాత్రం కనబర్చలేకపోయింది. ఇక ఎయిర్‌ ఇండియాను పునరుద్ధరించడం అసాధ్యమని, ప్రైవేటీకరించడమే మేలని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అందుకు అనుగుణంగా కేంద్రం అడుగులు ముందుకు వేస్తున్నది.

వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో సంస్థలో వాటాల విక్రయ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రధాన మంత్రి కార్యాలయం లక్ష్యం నిర్దేశించినట్లుగా సమాచారం. ఎయిర్‌ ఇండియాలో వాటా కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు టాటా గ్రూపు, ఇండిగో ఆసక్తి ప్రదర్శించాయి. కంపెనీ అంతర్జాతీయ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమని ఇండిగో ప్రకటించింది. ప్రస్తుతం సంస్థలో 2,500 మంది ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రేడ్ యూనియన్ మాత్రం ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఎయిర్‌ ఇండియా, దాని అనుబంధ విభాగాల విలువ రూ.30 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంతేకాదు, సంస్థకు రూ.8 వేల కోట్ల విలువ చేసే స్థిరాస్తులు కూడా ఉన్నాయి.